నేడు సమాజంలో అమ్మాయి పెళ్లీడు కొచ్చిందంటే తల్లిదండ్రులకు గుండెల మీద భారంగా మారుతుంది.. త్వరగా వారికి పెళ్లి చేసి పంపిస్తే ఒక పని అయిపోతుందని భావిస్తున్నారు.. ఇలా వారు అనుకోవడంలో తప్పు లేదు ఎందుకంటే, నేటి కాలంలో యవ్వనంలోకి అడుగు పెట్టే యువతి యువకులు భవిష్యత్తును బంగారంగా మలచుకోవలసిన సమయంలో ప్రేమ అనే ఉచ్చులో చిక్కుకుని జీవితాలను సమాధి చేసుకుంటున్నారు.. అదీగాక ప్రేమ పేరుతో జరిగే మోసాలు, నమ్మకం అనే ముసుగులో జరిగే దారుణాలు చూస్తుంటే ఆడపిల్లల పట్ల తల్లిదండ్రులకు భయం నెలకొంది..

 

 

ఇలాంటి పరిస్దితుల్లో అమ్మాయి యవ్వనంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే  పెళ్లికి సన్నాహాలు చేసుకుంటున్నారు.. కానీ కొందరు అమ్మాయిలు మాత్రం తమ పెళ్లి విషయంలో తల్లిదండ్రులను ఎదిరిస్తున్నారు.. ఇలాంటి  సంఘటనే షాద్‌నగర్‌ పట్టణంలో చోటు చేసుకుంది. ఆ వివరాలు చూస్తే. ఫరూఖ్‌నగర్‌ గుండుకేరికి చెందిన అమ్మాయి(18) పదో తరగతి పూర్తి చేసింది.. ఈ క్రమంలో యువతి తల్లిదండ్రులు రంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలోని ఓ గ్రామానికి చెందిన అబ్బాయితో ఈ నెల 31న వివాహం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఈ పెళ్లి నచ్చని యువతి తనకు ఇంకా చదువుకోవాలని ఉందని, అందువల్ల ఈ పెళ్లి ఇష్టం లేదని షీ టీం పోలీసులకు ఫోన్‌ చేసింది.

 

 

ఈ సమాచారంతో యువతి ఇంటికి చేరుకున్న పోలీసులకు, వీరితో పాటుగా వచ్చిన ఐసీడీఎస్‌ అధికారి నాగమణికి సదరు యువతి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసింది. అంతే కాకుండా తాను ఇంట్లో ఉండనని, ఎక్కడైనా ప్రభుత్వ వసతిగృహంలో చేర్పించి తనకు చదువకునే అవకాశం కల్పించాలని కోరింది. దీంతో నాగమణి అమ్మాయి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్‌ చేశారు. అనంతరం షీ టీం పోలీసులు విషయాన్ని షాద్‌నగర్‌ పట్టణ సీఐ శ్రీధర్‌కుమార్‌కు వివరించి యువతిని హైదరాబాద్‌ వనస్థలిపురంలోని సఖి కేంద్రానికి తరలించారు.

 

 

ఇకపోతే ఎవరైనా అమ్మాయిలపై వేధింపులకు పాల్పడితే చర్యలు తప్పవని శంషాబాద్, షాద్‌నగర్‌ జోన్‌  షీ టీం ఇన్‌చార్జ్, ఏఎస్‌ఐ జయరాజ్‌ తెలిపారు. అంతే కాకుండా ఎక్కడైనా ఇలాంటి వేధింపులు ఎదుర్కొంటున్న యువతులు ఆందోళన చెందకుండా షీ టీం పోలీసులకు సమాచారం అందించాలని, కాగా సమాచారం అందించిన వారి వివరాలు, పేరును గోప్యంగా ఉంచుతామని పేర్కొన్నారు. అదీగాక మహిళలు, యువతులకు ఇబ్బందులు ఎదురైతే సైబరాబాద్‌ షీ టీం ఫోన్‌ నంబర్‌ 9490617444, శంషాబాద్, షాద్‌నగర్‌ ప్రాంత షీ టీం ఫోన్‌ నంబర్‌ 9490617354కు వాట్సాప్‌ ద్వారా సమాచారాన్ని అందించాలని వారు సూచించారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: