దేశంలో కరోనా క‌ల‌క‌లం కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.  దేశంలో కోటి మందికి కోవిడ్19 ప‌రీక్ష‌లు చేసిన‌ట్లు ఇటీవ‌లే భారతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎమ్మార్‌) ప్ర‌క‌టించింది. తాజాగా మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. క‌రోనా వ్యాప్తిని అంచనా వేయడానికి  మరోసారి దేశవ్యాప్త సర్వే నిర్వహించనున్న‌ట్లు వెల్ల‌డించింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖలో ప్రత్యేక డ్యూటీలో ఉన్న అధికారి రాజేశ్‌ భూషణ్‌ వెల్లడించారు.

 


దేశ‌వ్యాప్తంగా ఈ సర్వేను రెండు దశల్లో నిర్వహిస్తామని ఐసీఎమ్మార్‌ ముందే చెప్పింది. మొదటి దశలో చిన్న చిన్న పట్టణాల్లో, వైరస్‌ ప్రభావం తక్కువగా ఉన్న ప్రాంతాల్లో సర్వే నిర్వహించారు. ప్రస్తుతం కంటైన్మెంట్‌ జోన్ల పరిధిలో, హాట్‌స్పాట్‌ నగరాల్లో సర్వే నిర్వహించనున్నట్టు తెలుస్తున్నది. ఐసీఎమ్మార్‌ మేలో నిర్వహించిన సర్వేకు ఇది కొనసాగింపు అని చెప్పారు. అప్పుడు 83 జిల్లాలో ‘సీరో సర్వే’ నిర్వహించారు. అయితే ఆ సర్వే ఫలితాలను ఇంకా వెల్లడించలేదు. ఇదిలాఉండ‌గా, జూలై ఆరో తేదీ నాటికి ఐసీఎంఆర్ కోటి ప‌రీక్ష‌లు నిర్వ‌హించింది. ఉద‌యం 11 గంట‌ల వ‌ర‌కు 1,00,04,101 మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. 

 


ఇదిలాఉండ‌గా, ప్రైవేటు వైద్యులు సహా క్వాలిఫైడ్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌(క్యూఎంపీ) అందరూ కరోనా పరీక్షల కోసం సిఫారసు చేయొచ్చని ఇండియన్‌ కౌన్సిల్‌ ఫర్‌ మెడికల్‌ రీసెర్చ్‌(ఐసీఎంఆర్‌) తెలిపింది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా పరీక్షల కోసం సిఫారసు చేయోచ్చని పేర్కొంది. ఈ మేరకు రాష్ర్టాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి ప్రీతిసూదన్‌, ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ బలరాం భార్గవ లేఖ రాశారు. ప్రభుత్వ వైద్యులపై ఒత్తిడిని తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. అదేవిధంగా వైరస్‌ వ్యాప్తిని అరికట్టేందుకు పరీక్షల సంఖ్యను పెంచడం దీని లక్ష్యమన్నారు. ఇప్పటివరకు కోవిడ్‌-19 పరీక్ష చేయడానికి ప్రభుత్వ వైద్యుడి ప్రిస్క్రిప్షన్‌ అవసరం కాగా తాజా ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏ వ్యక్తినైనా పరీక్షించడానికి ల్యాబ్‌లు స్వేచ్ఛగా ఉండాలని పేర్కొన్నారు. దేశంలో కోవిడ్‌-19 వ్యాప్తిని గుర్తించడానికి, నిరోధించడానికి టెస్ట్‌ ట్రాక్‌ ట్రీట్‌ మాత్రమే మార్గమన్నారు. కాబట్టి అన్ని రాష్ర్టాలు పరీక్షల సామర్థ్యాన్ని పెంచాలని సూచించారు. కోవిడ్‌-19 పరీక్ష కోసం దేశవ్యాప్తంగా 761 ప్రభుత్వ ప్రయోగశాలలు, 288 ప్రైవేటు ప్రయోగశాలలకు వైద్య సంస్థ ఆమోదం తెలిపింది. కోవిడ్‌ పరీక్షల కోసం ల్యాబ్‌లను పూర్తిగా ఉపయోగించుకునేలా చూడాలని రాష్ర్టాలకు సూచించింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: