ఉప్పల్‌కు చెందిన ఓవ్యక్తి హైటెక్ సిటీలోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తూ నెలకు రూ.45వేలు జీతం పొందేవాడు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో సరిపడా పని లేదని ఉద్యోగం నుంచి తీసేశారు. చేసేది లేక తన ద్విచక్ర వాహనంపై ప్రతిరోజు కొత్తపేట పండ్ల మార్కెట్‌ నుంచి రోజుకోరకం పండ్లు తీసుకొని వచ్చి వీధుల్లో  తిరుగుతూ అమ్ముకుంటున్నాడు. ఇది ఈ ఒక్క వ్య‌క్తి దీన ప‌రిస్థితి మాత్ర‌మే కాదు. క‌రోనా దినసరి కూలీలు, చిరుద్యోగుల పాలిట శాపంగా మారింది. పరిశ్రమలకు భారీ ముప్పు తెచ్చిపెట్టింది. నష్టాల బాట పట్టిన పరిశ్రమలు చేసేదేమి లేక ఉద్యోగుల తొలగింపునకు శ్రీకారం చుట్టాయి. అలా ఎంద‌రో రోడ్డున ప‌డ్డారు.

 

క‌రోనా క‌ల‌క‌లం కొన‌సాగ‌క‌ముందు సూటు.. బూటు వేసుకుని కొలువులకు వెళ్లిన వారు ఉపాధికోల్పోయి రోడ్డున పడుతున్నారు. కొందరు చిరు వ్యాపారాలను ఎంచుకుని బతుకుబండి లాగుతున్నారు. ఉన్నత చదువుతో దర్జాగా నాలుగు చక్రాల బండిపై నిన్నటివరకు తిరిగిన కొందరు నేడు ఉపాధి లేక దానినే వ్యాపార కేంద్రంగా మలుచుకుని వీధుల్లో తిరుగుతూ కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్నారు. ఇందులో అధికంగా సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలు, ప్రైవేటు స్కూళ్లు, షాపింగ్‌మాల్స్‌లో పనిచేసిన చేసినవారే ఉన్నారు.

 


ఓ ప్రైవేటు కంపెనీలోఉద్యోగం చేస్తున్న ఓటీలతో కలిపి నెలకు రూ.15 నుంచి 20 వరకు వేతనం పొందేవాడు. ఇటీవల పరిశ్రమలో పని సరిగా ఉండటం లేదని ఉద్యోగంలో నుంచి తొలగించారు. దీంతో చేసేదిలేక ఉదయం న్యూస్‌పేపర్‌ వేసుకుంటూ మధ్యాహ్నం పండ్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఎల్బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి గడిచిన మూడేండ్లుగా ఓ ప్రైవేటు కళాశాలలో జేఎల్‌ (జూనియర్‌ లెక్చలర్‌)గా పనిచేసేవాడు. వచ్చే జీతంతోఇంటికిరాయి కట్టుకుని.. కుటుంబాన్ని పోషించుకునేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా మార్చి నుంచి కళాశాలలు మూసివేయటంతో పాటుఉద్యోగం నుంచి తొలగించారు. ఉన్న ఊరిలో ఉపాధిలేక ఇక్కడే కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇలా ఎంద‌రినో హైద‌రాబాద్ ప‌రిధిలో క‌రోనా రోడ్డున ప‌డేసిన‌ ప‌రిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: