ఆసియా కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) చైర్మన్ ముకేశ్‌ అంబానీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ భారతీయ వ్యాపార దిగ్గ‌జం త‌న సంప‌ద రికార్డుల పరంప‌ర‌ను కొన‌సాగిస్తున్నాడు. నికర విలువ పరంగా ప్రపంచంలోనే ప్రముఖ పెట్టుబడిదారుడు వారెన్ బఫెట్‌ను అధిగమించి తాజాగా మరో ఘనత సాధించాడు. బఫెట్‌ సంపద గురువారానికి 67.9 బిలియన్ డాలర్లుండగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ చైర్మన్ ముఖేష్ అంబానీ సంప‌ద‌ 68.3 బిలియన్లు. త‌ద్వారా 2012లో ప్రారంభమైన బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ రికార్డుల ప్ర‌కారం బ‌ఫెట్‌ను అంబానీ వెనక్కి నెట్టారు. అంబానీ ఇప్పుడు భూమి మీద నివసిస్తున్నఅత్యంత ధనవంతుల్లో ఎనిమిదో వాడు. బఫెట్‌ తొమ్మిదోస్థానంలో ఉన్నాడు. గత నెల ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల క్లబ్‌లో ఏకైక ఆసియా వ్యాపారవేత్తగా అంబానీ నిలిచారు. 

 


అయితే, ఈ రికార్డులు న‌మోద‌వ‌డం వెనుక రెండు ఆస‌క్తిక‌ర‌మైన కార‌ణాలు ఉన్నాయి. ఫేస్‌బుక్ ఇంక్, సిల్వర్ లేక్ వంటి సంస్థల నుంచి బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు పెట్టడంతో అంబానీ షేర్లు మార్చిలో కనిష్ట స్థాయి నుంచి రెట్టింపయ్యాయి. మ‌రోవైపు ఇదే స‌మ‌యంలో బఫెట్‌ 2.9 బిలియన్ డాలర్లను స్వచ్ఛంద సంస్థకు ఇవ్వడంతో ఆయన సంపద తగ్గింది. త‌ద్వారా వీళ్లిద్ద‌రి ర్యాంక్‌ల‌లో తేడాలు వ‌చ్చాయి. కార‌ణాలు ఏవైతేనేం కానీ...అంబానీ భార‌తీయుల ద‌మ్మేంటో ప్రపంచానికి చాటి చెప్పాడ‌నేది నిజం.

 


ఇక బెర్క్‌షైర్‌ హాథవే చైర్మన్‌, సీఈవో వారెన్‌ బఫెట్ దాతృత్వంలో మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. గేట్స్‌ ఫౌండేషన్‌, ఇంకో 4 కుటుంబ చారిటీలకు దాదాపు 2.9 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.22 వేల కోట్లు) విలువైన కంపెనీ షేర్లను బఫెట్‌ విరాళంగా ఇచ్చారు. 15.97 మిలియన్ల క్లాస్‌ బీ షేర్లను వార్షిక విరాళంగా ప్రకటించినట్లు బెర్క్‌షైర్‌ తెలిపింది. ఇందులో అధిక మొత్తం బిల్‌ అండ్‌ మిలిందా గేట్స్‌ ఫౌండేషన్‌కే వెళ్లాయి. మిగతా షేర్లు చనిపోయిన బఫెట్‌ మొదటి భార్య పేరుతో ఉన్న చారిటీ, పిల్లలు హోవర్డ్‌, సుసాన్‌, పీటర్‌లు నిర్వహిస్తున్న చారిటీలకు చేరాయి. 2006 నుంచి ఏటా బఫెట్‌ తన వాటాల్లో కొంత విరాళంగా ప్రకటిస్తున్నారు. వచ్చే నెల 30తో 90వ పడిలోకి అడుగుపెడుతున్న బఫెట్‌.. ఇప్పటిదాకా 37.4 బిలియన్‌ డాలర్లకుపైగా విలువైన షేర్లను వివిధ చారిటీలకు విరాళంగా ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: