కెసిఆర్ జగన్ ఇద్దరూ మంచి మిత్రులే. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా ఉన్న ఈ ఇద్దరూ, ఆ రాష్ట్రాల సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను బట్టి  నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు. కాకపోతే తెలంగాణ, ఆంధ్రలోనూ జగన్ కెసిఆర్ తీసుకుంటున్న  నిర్ణయాలు తప్పకుండా, జనాల్లో ప్రభావితం చేస్తాయి.  జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా, ఏ కొత్త పథకాన్ని అమలుచేసినా, దానిపై కెసిఆర్ పై ఒత్తిడి ఉంటుంది. అలాగే కేసీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకున్నా, పథకాలు అమలు చేసినా ఏపీలోనూ ఆ ప్రభావం ఉంటుంది. అక్కడ చేశారు కాబట్టి, ఇక్కడ ఎందుకు చేయలేరు అనే డిమాండ్ కూడా ఎక్కువగా వినిపిస్తుంటుంది. ఇక విషయానికి వస్తే కరోనా వైరస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో విజృంభిస్తోంది. ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం సాధ్యం అయ్యే పనిలా కనిపించడం లేదు.

 

ఈ నేపథ్యంలో కొంతలో కొంత జనాలకు ఊరటనిచ్చే విధంగా ఏపీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా చికిత్స లన్నిటిని, ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకువస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయం తీసుకోవడంపై ఏపీ ప్రజల్లో జగన్ కు మరింత ఆదరణ పెరగడంతో పాటు, పార్టీలకతీతంగా ప్రశంసలు దక్కుతున్నాయి. ఇక ఇదే సమయంలో తెలంగాణలో కేసీఆర్ తీరుపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఏపీలో అమలు చేసినట్లు కరోనా చికిత్సలను ఆరోగ్య శ్రీ లో చేర్చాలంటూ కేసీఆర్ పై తీవ్ర ఒత్తిడి మొదలైంది. ధనిక రాష్ట్రంగా పదేపదే చెప్పుకుంటున్న కెసిఆర్, ఇంతటి విపత్కర సమయంలో ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు అంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

ఎలాగూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడం, కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకీ వేలల్లో నమోదవుతున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపజేసి, ప్రజలకు మేలు చేయాలనే డిమాండ్ ఎక్కువ అవుతున్నాయి. 
అయితే ఇప్పటి వరకు ఈ విషయంలో టిఆర్ఎస్ పార్టీ అధికారికంగా స్పందించలేదు. కానీ తెలంగాణలోని విపక్షాలు, ప్రజలు , కుల సంఘాల నాయకుల నుంచి పెద్దఎత్తున వినతులు ప్రభుత్వానికి అందుతున్నాయి. తాజాగా బీసీ సంఘాల నేతలు కూడా ఆరోగ్య శ్రీ పరిధిలోకి కరోనాను తీసుకురావాలని, ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ ను కోరారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా ఇప్పుడు కేసీఆర్ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలుస్తోంది. గతంలోనూ ఆర్టీసీ విషయంలో జగన్ నిర్ణయం కారణంగా కేసీఆర్ ఇబ్బంది ఎదుర్కొన్నారు . ఇప్పుడు ఈ వ్యవహారంలోనూ ఆ విధంగానే ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: