తెలంగాణ సీఎం కేసీఆర్ కొత్త సెక్రటేరియట్ నిర్మాణానికి భూమి పూజ చేసిన ఏడాది తర్వాత.. పాత సచివాలయం భవనాల కూల్చివేతలు మొదలయ్యాయి. హైకోర్టులో విచారణ జరగడంతో.. ఇంతకాలం ఆలస్యం అయింది. కూల్చివేయ‌డం ప్రజాధ‌నాన్ని వృధా చేయ‌డ‌మే అని ఆరోపిస్తుస్తూ కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. దాదాపు ఏడాదిపాటు విచార‌ణ చేసిన  హైకోర్టు ఈ మ‌ధ్యే ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తాము అడ్డుకోలేమ‌ని తీర్పు చెప్పింది కోర్టు. ఇప్పటికే  స‌చివాల‌య భ‌వ‌నాల్లో ప‌నిచేసే ఉద్యోగుల‌ను మ‌రొక చోటుకు త‌ర‌లించిన అధికారులు కూల్చివేత‌ల‌ు మొద‌లుపెట్టారు. ఆరో తేదీ నుంచి కూల్చివేత‌ల‌ను మొద‌లుపెట్టారు. నాలుగు రోజుల పాటు నిరాటంకంగా  కొన‌సాగాయి. రెండు రోజుల త‌ర్వాత  మ‌రికొంద‌రు  హైకోర్టుకు వెళ్లారు. క‌రోనా నిబంధ‌న‌లు పాటించ‌డం లేద‌ని... గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాల‌ను పాటించ‌డం లేద‌ని  వాదించారు. శ‌ని, ఆదివారం రెండు రోజుల‌పాటు భ‌వ‌నాల‌ను కూల్చివేయొద్దని  హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

 

ఇప్పటికే  భ‌వ‌నాల కూల్చివేత‌లు మొద‌లుపెట్టామని, మ‌ధ్యలో నిలిపివేయ‌లేమ‌ని ప్రభుత్వం కోర్టుకు నివేదించింది. అన్ని జాగ్రత్తలు తీసుకునే  కూల్చివేత‌లు ప్రారంభించామ‌ని చెప్పింది. ఇరుపక్షాల వాద‌న‌లు విన్న కోర్టు కూల్చివేత‌ల‌కు తాత్కాలికంగా బ్రేక్ వేసింది. హైకోర్టు ఇప్పుడు కూల్చివేత‌ల‌పై ఎలాంటి ఆదేశాలు ఇస్తుంద‌నే ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికే స‌చివాల‌యం కొత్త డిజైన్ ను కూడా విడుద‌ల చేసింది.  అన్నీ అనుకూలిస్తే ఏడాదిలోపు కొత్త సచివాల‌యం పూర్తి చేయాల‌ని లక్ష్యాన్ని నిర్దేశించుకుంది. 

 

స‌చివాల‌య కూల్చివేత ప‌నుల‌ను సీఎస్ సోమేష్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. స‌చివాల‌యంలోని దాదాపు అన్ని బ్లాకుల‌ను కూల్చివేశారు. జీ బ్లాకు వంద‌శాతం, నార్త్ హెచ్ బ్లాకు 60శాతం, సౌత్ హెచ్ బ్లాక్ 45 శాతం కూల్చివేశారు. జే, కే బ్లాకులు 40శాతం, ఏ, బీ,సీ బ్లాకులు 30 శాతం, డి బ్లాక్, ఎల్ బ్లాక్  20 శాతం కూల్చివేత పూర్తయింది. న‌ల్లపోచ‌మ్మ గుడి, మ‌సీదు, విద్యుత్ సూపరింటిండెంట్ భ‌వ‌నాలు దాదాపు తీసేశారు. 17 జేసీబీల‌తో నాలుగు రోజుల పాటు రాత్రింబవళ్లు కూల్చివేతలు జరిగాయి. పెద్ద బుల్డోజ‌ర్‌తో  శిథిలాల‌ను సచివాలయ ఆవరణలోనే ఓ చోట వేస్తున్నారు. మ‌హారాష్ట్ర నుంచి వ‌చ్చిన కూలీలు ఈ పనుల్లో  ఉన్నారు. కూల్చివేత‌ల‌పై  హైకోర్టుకు  ప్రభుత్వం నివేదిక స‌మ‌ర్పిస్తుంది. దీనిపై  విచారించి హైకోర్టు నిర్ణయం తీసుకోనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: