తెలంగాణలో కారు పార్టీని ఓవర్టేక్ చేసే విధంగా బిజెపి 'బండి' స్పీడుగా దూసుకు వెళుతోంది. రాబోయే ఎన్నికల్లో బీజేపీ జెండా రెపరెపలాదించాలి అనే ఉద్దేశంతో కొత్తగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ టిఆర్ఎస్ తీవ్రస్థాయిలో పోరాడుతూ వస్తున్నారు. ఇదే విధంగా ఆయన మరోసారి టిఆర్ఎస్ పార్టీ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రజలు కరోనాకు భయపడుతుంటే, ముఖ్యమంత్రి కేసీఆర్ కు బీజేపీ భయం పట్టుకుందని బండి సంజయ్ విమర్శించారు. బిజెపి కార్యాలయంపై టిఆర్ఎస్ నాయకులు దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. బిజెపి నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా, బిజెపి ఎప్పుడూ అదుపుతప్పి ప్రవర్తించలేదని, కెసిఆర్, కవిత పై ఎన్ని కేసులు ఉన్నాయో ప్రజలందరికీ తెలుసు అంటూ ఆయన విమర్శించారు. 

 

బిజెపి పై దాడులకు పాల్పడితే సరైన సమాధానం చెబుతాం అంటూ ఆయన హెచ్చరించారు. సిద్ధాంతం కలిగిన పార్టీ బీజేపీ అని, టిఆర్ఎస్ కు ఎటువంటి సిద్ధాంతాలు లేవని బండి విమర్శించారు. దాడులతో భయపెట్టి ప్రతిపక్షాలను కట్టడి చేద్దామని చూస్తే, అంతకు మించిన మూర్ఖత్వం మరొకటి ఉండదని విమర్శించారు. ప్రజాస్వామ్యబద్ధంగా, శాంతియుతంగా ఉండాలని బిజెపి కోరుకుంటోందని, కానీ ప్లాన్ ప్రకారమే టిఆర్ఎస్ దాడికి పాల్పడిందని, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది అనే విషయాన్ని మరిచిపోవద్దని బండి సంజయ్ టిఆర్ఎస్ ను హెచ్చరించారు.

 

 ఈ విషయాన్ని ఇక్కడితో వదిలి పెట్టబోమని, కేంద్రమంత్రులకు ఫిర్యాదు చేస్తామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ఇక టీఆర్ఎస్ కూడా బీజేపీ నాయకులపై ఎదురు దాడి చేసింది. బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్ తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల పైన చేసిన విమర్శలకు టిఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగడమే కాకుండా  ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ప్రస్తుతం బిజెపి టిఆర్ఎస్ మధ్య వాడీవేడిగా రాజకీయ వాతావరణం మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: