వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు కోసం రాష్ట్రంలో కుట్ర ప్రారంభమైంది. రాష్టంలో వైఎస్సార్ కాంగ్రెస్ పేరుతో చలామణి అవుతున్న యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ గుర్తింపు రద్దు చేయాలని అన్న వైఎస్‍ఆర్ కాంగ్రెస్ అధ్యక్షుడుగా ఉన్న మహబూబ్ భాషా అనే వ్యక్తి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించాడు. గతంలో కేంద్ర ఎన్నికల కమిషన్ వైఎస్‍ఆర్ కాంగ్రెస్ అని వాడకూడదని వైఎస్సార్సీపీ నేతలకు స్పష్టం చేసింది. ఆ షరతుపైనే పార్టీ పేరు రిజిష్టర్ అయింది. 
 
అయితే కొన్ని నెలల క్రితం యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అన్న వైఎస్‍ఆర్ కాంగ్రెస్ కు తమకు సంబంధం లేదని... తమకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాడుకునే అవకాశం ఇవ్వాలని కోరింది. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం అందుకు అంగీకరించలేదు. అయితే జగన్ సర్కార్ అధికార పార్టీ లెటర్ హెడ్ లో సైతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని వాడుతూ ఉండటంతో వివాదం మొదలైంది. కొన్ని రోజుల క్రితం వరకు అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుతో ఒక పార్టీ ఉన్నట్లు కూడా ఎవరికీ తెలియదు. 
 
కొన్ని రోజుల క్రితం ఎంపీ రఘురామ కృష్ణంరాజు తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అని కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఉండటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదం వెనుక ఇంటి దొంగల కుట్రే ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కోర్టు పిటిషన్ ను విచారణకు స్వీకరించటంతో పాటు జగన్ పార్టీకి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. 
 
వైఎస్సార్సీపీకి ఇది ఇబ్బందికర పరిణామమే అనే చెప్పాలి. తదుపరి విచారణను కోర్టు సెప్టెంబర్ 3కు వాయిదా వేస్తూ అప్పట్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని పేర్కొంది. 2009 సంవత్సరంలో అన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజిష్టర్ అయింది. సీఎం జగన్ ను ప్రత్యక్షంగా దెబ్బ కొట్టలేక పరోక్షంగా దెబ్బ కొట్టడానికి మహబూబ్ భాషాను ఎవరో పావుగా వాడుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వివాదం భవిష్యత్తులో ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: