తెలంగాణ పాత సచివాలయం కూల్చివేత విషయంపై కాంగ్రెస్ పెద్ద ఎత్తున పోరాటం చేస్తోంది. కూల్చివేతను అడ్డుకునేందుకు కోర్ట్ దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ వేసి తాత్కాలికంగా అడ్డుకోగలిగింది. ఈ వ్యవహారంలో టిఆర్ఎస్ ప్రభుత్వం ను ఇరుకున పెట్టే విధంగా రేవంత్ సరికొత్త ఆరోపణలతో దూసుకెళ్తున్నారు. ఇప్పటికే సచివాలయం లో గుప్తనిధులు ఉన్నాయని, అందుకే ఇంత ఆకస్మికంగా అర్ధరాత్రి సమయంలో కూల్చివేతకు పాల్పడ్డారని, కేసీఆర్ కొద్దిరోజుల పాటు ఎవరికీ కనిపించకుండా అదృశ్యం అవ్వడానికి కారణం అంటూ ఆయన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా సచివాలయం జీ బ్లాక్ భూగర్భంలో ఎన్నో రహస్యాలు ఉన్నాయి అని, ఆపరేషన్ జి బ్లాక్ వెనుక భారీ ఆర్థిక కుట్ర జరుగుతోందని రేవంత్ ఆరోపణలు చేస్తున్నారు. 

IHG


సచివాలయం కూల్చివేత ఆపాలంటూ, హైకోర్టు స్టే ఇవ్వడంతోనే కేసీఆర్ ఇప్పుడు బయటకు వచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా అనేక విషయాలను బయటపెట్టారు. 1888లో సచివాలయం జీ బ్లాక్ ను ఆరో నిజాం నవాబ్ అలీ ఖాన్ నిర్మించాలని, దీనిని అప్పట్లో సైఫాబాద్ ప్యాలస్ అని పిలిచేవారని రేవంత్ చెప్పారు. అప్పట్లో నిజాం ఆర్థిక వ్యవహారాలు, ట్రెజరీ కార్యకలాపాలన్నీ జిబ్లాక్ లోనే జరిగేవని, నిజాం రిజర్వ్ బ్యాంక్ గా ఉండేదని విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఈ బ్లాక్ కింద భూగర్భంలో స్ట్రాంగ్ రూమ్ లు నిర్మించినట్లుగా అనుమానాలు ఉన్నాయని, జీ బ్లాక్ కింద నిజాం నిధి ఖచ్చితంగా ఉందన్న సంకేతాలు కనిపించాయని, వేల కోట్ల సంపద కొల్లగొట్టడానికే సచివాలయం కూల్చివేత ఇంత అకస్మాత్తుగా, అర్ధరాత్రి సమయంలో చేపట్టారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు.


 ఖచ్చితంగా ఈ కూల్చివేతల వెనుక కుట్ర ఉందని, దీనిని కోర్టులు సుమోటోగా స్వీకరించి, ఈ వ్యవహారాన్ని నిగ్గు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా సచివాలయం కింది భాగంలో భారీ ఎత్తున గుప్త నిధులు ఉన్నాయనే ఆరోపణలతో టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టే విధంగా సరికొత్త ఆధారాలను తవ్వి తీసే పనిలో పడ్డారు. ప్రస్తుతం రేవంత్ ఆరోపణలు సంచలనం రేకెత్తిస్తోంది. నిజంగా ఈ నిధులు ఉన్నాయా అనే అనుమానాలు, ఆసక్తి, అందరిలోనూ కలుగుతోంది. రేవంత్ ఆరోపణల్లో నిజం ఉన్నా లేకపోయినా, దీనిపై స్పందించి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం టిఆర్ఎస్ ప్రభుత్వం పై ఉంది. ఈ విషయంలో పురావస్తు శాఖ కూడా స్పందించి ఈ గందరగోళం కు తెరదించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: