ఈ సంవత్సరం రిపబ్లిక్ డే పరేడ్‌లో అయోధ్య రామ మందిర ఆయల నమూనాకు సంబంధించిన శకటాన్ని ప్రదర్శించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే శకటం కూడా సిద్ధమైంది. శకటం ముందు భాగంలో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రాస్తున్నట్లు కనిపిస్తోంది. దీని మధ్య భాగంలో భక్తులు రాముడిని కీర్తిస్తున్నట్లు ఉంది. శకటం వెనుక భాగంలో రామ మందిరం నమూనా ఉంది. ఇది అయోధ్య సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుందని  చెబుతున్నారు. రామ జన్మభూమిగా ప్రసిద్ధి చెందిన అయోధ్య  ప్రాచీన సాంస్కృతిక వారసత్వం, విలువలకు శకటం అద్దం పడుతుందని యూపీ ప్రభుత్వం తెలిపింది. వారసత్వ సంపద విలువను కాపాడుకోవాలనే ఉద్దేశంతో రిపబ్లిక్‌ డే పరేడ్‌లో ఈ శకటాన్ని ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించింది.

             రామాయణంలోని ముఖ్యమైన ఘట్టాలను ఈ శకటంలో చూడవచ్చు. అప్పటి సామాజిక, మతపరమైన పరిస్థితులు, సనాతన ధర్మం, విలువలను ఇవి గుర్తుచేస్తున్నాయి. షబరి ఎంగిలి చేసిన పండ్లను రాముడు తినడం, రావణుడు సీతను ఎత్తుకెళ్లడం, అహల్యకు సంబంధించిన సన్నివేశం, హనుమంతుడు సంజీవని పర్వతాన్ని తీసుకురావడం, అశోకవనం... వంటివాటిని శకటంలో తీర్చిదిద్దారు. అయోధ్యలో ఘనంగా జరిగే దీపోత్సవానికి సంబంధించిన సన్నివేశాలు కూడా శకటంలో చూడవచ్చు. పరేడ్‌లో ఈ శకటానికి రెండు వైపులా సాధువులు, పూజారులు నడుస్తూ రాముడిపై తమ ప్రేమను చాటనున్నారు.

       అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. రామాలయ నిర్మాణం కోసం దేశ వ్యాప్తంగా విరాళాలు కూడా సేకరిస్తున్నారు. ఫిబ్రవరి 27 వరకు విరాళాల సేకరణ కొనసాగనుంది. దేశ వ్యాప్తంగా ఐదు లక్షల గ్రామాల్లోని కోటి ఇళ్ల నుంచి విరాళాలను సేకరించనున్నట్టు రామ జన్మభూమి ట్రస్టు ప్రకటించింది. అయోధ్య రామాలయ నిర్మాణానికి భారీ ఎత్తున విరాళాలు అందుతున్నాయి. తెలంగాణలో తొలి రోజే  దాతల నుంచి కోట్లాది రూపాయల విరాళాలు అందాయి. మైహోమ్ గ్రూప్ సంస్థలు  రూ. 5 కోట్లు, మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్  రూ. 6 కోట్లు, అపర్ణ కన్స్ స్ట్రక్షన్స్  రూ. 2 కోట్లు , డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీ కోటి రూపాయలు ఇచ్చింది.   

మరింత సమాచారం తెలుసుకోండి: