తొలి దశ పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో నామినేషన్లు కూడా మొదలయ్యాయి. ప్రభుత్వ అధికారులు సహకరించకపోయినా ఎన్నికలు జరిపి తీరుతామని చెప్పారు ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్.  తొలి దశ ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో పార్టీ కేడర్ ను అప్రమత్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.  పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికలకు సంబంధించి కీలక సూచనలు చేశారు చంద్రబాబు.

           అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ   పతనానికి  పంచాయతీ ఎన్నికలే నాంది కావాలని పార్టీ నేతలతో చెప్పారు చంద్రబాబు. ఈ ఎన్నికల ద్వారా వైసీపీ రౌడీ రాజ్యానికి ముక్కుతాడు వేయాలన్నారు. అన్ని పంచాయతీలలో టీడీపీ అభ్యర్థులు పోటీలో ఉండాలని సూచించారు. వైసీపీ దౌర్జన్యాలను దీటుగా ఎదుర్కోవాలని... బలవంతపు ఏకగ్రీవాలు జరగకుండా అడ్డుకోవాలని పార్టీ కేడర్ కు దిశా నిర్దేశం చేశారు చంద్రబాబు.  ఎన్నికల కోడ్ అమల్లో ఉందని... వైసీపీ నేతల దౌర్జన్యాలను సెల్ ఫోన్లలో రికార్డ్ చేసి, అధికారులకు, టీడీపీ కేంద్ర కార్యాలయానికి పంపాలని చంద్రబాబు సూచించారు.  నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయం వైసీపీలో ఉందని అన్నారు.టీడీపీ కార్యకర్తంగా గట్టిగా పోరాడి వైసీపీని ఓడించాలని చంద్రబాబు పిలుపిచ్చారు.
 
    మరోవైపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో నిష్పక్షపాత ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి,  వర్ల రామయ్య లేఖ రాశారు. మార్చి 2020లో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అప్రజాస్వామిక, హింసాత్మక విధానాలను దృష్టిలో ఉంచుకొని ఈ విషయాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకు వస్తున్నానని లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోని ఒక వర్గం పోలీసులు అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై టీడీపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించారన్నారు. మార్చిలో నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఎన్నికల అధికారులు సహకరించలేదని తెలిపారు

మరింత సమాచారం తెలుసుకోండి: