తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా కేసీఆర్ తప్పుకుని.. ఆ స్థానంలో కేటీఆర్ ను నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారని కొందరు ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు  పోటీ పడి మరీ కేటీఆర్ కు జై కొడుతున్నారు. మంత్రుల స్థాయి నేతలు కూడా సీఎం మార్పు ఉంటుందనే ప్రకటనలు చేస్తుండటంతో.. కేటీఆర్ కు త్వరలోనే ముఖ్యమంత్రిగా పట్టాభిషేకం ఖాయమనే చర్చే ఎక్కువగా జరుగుతోంది.
 
       అధికార పార్టీ నేతలు మార్పులు ఉంటాయనే సంకేతమిస్తుండగా.. విపక్షాలు మాత్రం అలాంటేది ఉండదని చెబుతున్నారు.   సీఎం మార్పు అంశంపై సంచలన ప్రకటనలు చేస్తున్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. సీఎంగా తాను దిగిపోయే సాహసం కేసీఆర్ ఇప్పుడు చేయబోరని.. ఒకవేళ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. ఆ  వెంటనే టీఆర్ఎస్ లో అణుబాంబు పేలుతుందని చెప్పారు. కేటీఆర్ సీఎం కావడాన్ని టీఆర్ఎస్ కు చెందిన చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు సంజయ్. తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ పూజలు చేసి, పూజ సామగ్రిని కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరిలో కలిపారని మరోసారి ఆయన ఆరోపించారు.

                    కేటీఆర్ ను సీఎం చేస్తున్నట్టు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలకు కూడా చెప్పొచ్చానని, బీజేపీతో స్నేహం ఉంటుందంటూ తనకు అనుకూలమైన వ్యక్తుల చేత కేసీఆర్ చెప్పిస్తున్నాడని బండి సంజయ్ విమర్శించారు. ఏ పార్టీ కూడా కేసీఆర్ తో కాని, టీఆర్ఎస్ తో కాని పొత్తు పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటే అని మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెపుతున్నారని... ఇదంతా అబద్ధమని అన్నారు. ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్లి మోడీ, అమిత్ షా, నడ్డాలను కలుద్దామని... ఆ దమ్ము నీకుందా? అని కేసీఆర్ కు సవాల్ విసిరారు సంజయ్. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని చెప్పారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: