జనసేన-బీజేపీ మధ్య గ్యాప్ ఉందంటూ సోషల్‌మీడియాలో జరుగుతున్న ప్రచారానికి జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఊతమిస్తున్నాయి. తాజాగా తిరుపతిలో జరిగిన జనసేన పీఏసీ సమవేశంలో పాల్గొన్న నేతలు కూడా.. బీజేపీ తమను చిన్నచూపు చూస్తోందని, ఎక్కడా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఫిర్యాదు చేశారు. ఆ మరుసటి రోజు స్వయంగా పార్టీ చీఫ్ పవన్ కూడా.. రాష్ట్ర బీజేపీ నాయకత్వం తమను చిన్నచూపు చూస్తోందని వ్యాఖ్యానించడాన్ని బట్టి.. రెండు పార్టీల మధ్య దూరం ఉన్నట్లు తేలిపోయింది. పార్టీవర్గాల సమాచారం ప్రకారం.. బీజేపీ నేతలు మీడియాలో తప్ప ఎక్కడా కనిపించరని, వారికి స్థానికంగా ఎలాంటి పలుకుబడి లేదని వారు పవన్‌కు వివరించారు. పది-ఇరవైమందితో కార్యక్రమాలు చేసి, ఫొటోలు దిగి మీడియా ఎదుట హంగామా చేయడమే తప్ప బీజేపీకి క్షేత్రస్థాయిలో క్యాడర్ లేదని స్పష్టం చేశారు. అసలు ఏ కార్యక్రమాల్లోనూ బీజేపీ నాయకులు తమకు సమాచారం ఇవ్వడం లేదని, తాము మీడియాలోనే చూసి కార్యక్రమాలు తెలుసుకుంటున్నామని జనసేన నేతలు పవన్‌కు ఫిర్యాదు చేశారు.

ఇక మీకు భగవద్గీత పార్టీ కావాలా? బైబిల్ పార్టీ కావాలా అన్న తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ను కూడా, పవన్ తన వ్యాఖ్యలతో సంకటంలోకి నెట్టారు. అది సంజయ్ వ్యక్తగత అభిప్రాయమని, తానలా మతాన్ని విడగొట్టి చూడనని స్పష్టం చేయడం ద్వారా, బండి సంజయ్ వ్యాఖ్యలు తప్పని చెప్పకనే చెప్పడం గమనార్హం. పైగా తనకు ముస్లిం-క్రైస్తవులు కూడా ముఖ్యమేనని స్పష్టం చేసి, మరో షాక్ ఇచ్చారు. బీజేపీ నిర్వహించే రథయాత్రలో తాను పాల్గొంటే, వచ్చే భావోద్వేగాలు వేరుగా ఉంటాయన్న పవన్ అందులో పాల్గొనడం లేదని పరోక్షంగా స్పష్టం చేసి, బీజేపీని నిరాశకు గురిచేశారు. పైగా తనకు.. క్రైస్తవులు, ముస్లింలలో కూడా అభిమానులున్నారు. ఆదోనిలో నాకు ఎంతోమంది ముస్లిం అభిమానులున్నారని చెప్పడం విశేషం.

ఈ విధంగా బీజేపీకి జనసేన చీఫ్ పవన్ ఊహించని షాక్ ఇవ్వడం కమలదళాలను ఖంగు తినిపించింది. హిందుమతం అంటే బీజేపీ మాత్రమే కాదని, అలాంటి భావన నుంచి బయటపడాలని మీడియాకు సూచించడం గమనార్హం. మొత్తంగా.. తనకు క్రైస్తవులు, ముస్లింలు కూడా ప్రధానమేనని, తాను బీజేపీ మాదిరిగా వైసీపీని బైబిల్ పార్టీ అనలేనని, హిందు మతం అంటే బీజేపీ ఒక్కటే కాదన్న జనసేనాధిపతి పవన్ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: