అమరావతి: ఇటీవల మరణించిన కార్యకర్త వెంగయ్య నాయుడు కుటుంబాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పరామర్శించారు. గ్రామంలోని సమస్యపై ఎమ్మెల్యేని ప్రశ్నించినందుకు తమ కార్యకర్తను తీవ్రంగా దూషించారని, ఆయన మాటలకు మానసిక వేదన చెందిన నాయుడు ప్రాణాలు తీసుకున్నాడని పవన్ అన్నారు. ఇది ఆత్మహత్య కాదని, ఇది కచ్చితంగా వైసీసీ ఎమ్మెల్యే చేసిన హత్యేనని ఆయన ఆరోపించారు. శనివారం ఒంగోలులోని వెంగయ్య నాయుడు కుటుంబాన్ని పరామర్శించిన నేపథ్యంలో పవన్ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వానికి, ఆ పార్టీ ఎమ్మెల్యే రాంబాబుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వార్నింగ్ ఇచ్చారు. ‘అన్నా రాంబాబు.. గుర్తుంచుకో... నిన్ను అద:పాతాళానికి తొక్కేస్తాం’ అంటూ హెచ్చరించారు. అంతేకాకుండా ‘జగన్ రెడ్డి గారు మీ ఎమ్మెల్యే చేసిన పనికి శిక్షిస్తారా.. మీకు ఆ ధైర్యం ఉందా..?’ అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని నిలదీశారు. ‘ఎమ్మెల్యే అన్నా రాంబాబుపై మీ చానెల్స్‌లో వేసుకోండి.. మీ పేపర్స్‌లో రాసుకోండి.. మీరు జర్నలిస్టులను కూడా వదలటం లేదు. మీరు అనుకున్న వాళ్లే జర్నలిస్టులా..? ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా..? ఫ్యూడలిస్ట్ వ్యవస్థలో ఉన్నామా..? దీనికి జగన్ రెడ్డి సమాధానం చెప్పాలం’టూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు.

దాష్టీకాలను ప్రజలు ఎక్కువరోజులు తట్టుకోలేరని, కచ్చితంగా వారిలో తిరుగుబాటు వస్తుందని పవన్ అన్నారు. ప్రశ్నించే వారి కుటుంబాలను ఛిద్రం చేయాలనుకుంటే కుదరదని, అందుకు కచ్చితంగా మూల్యం చెల్లించుకోక తప్పదని పేర్కొన్నారు. పోలీస్ వ్యవస్థను కూడా వైసీసీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, వెంగయ్య మృతి వైసీపీ పతనానికి నాంది అని పవన్ కల్యాణ్ హెచ్చరించారు. వైసీపీ నేతలకూ కుటుంబాలు ఉన్నాయని, ఇలాంటి ప్రవర్తనలు ఎంతవరకూ సమంజసమో వారు కూడా ఆలోచించుకోవాలని సూచించారు. అనంతరం వెంగయ్య నాయుడు కుటుంబాన్ని ఓదార్చి వారికి పార్టీ తరపున ఆర్థిక సాయాన్ని అందించారు. వారికి అన్ని రకాలుగా పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: