ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వం ఎంత పటిష్ఠమైందయినా.. ముఖ్యమంత్రి ఎంత బలవంతుడయినా.. ఎన్నికల విషయం వచ్చేసరికి ఎలక్షన్ కమిషన్(ఈసీ)నే సుప్రీం. దానికి ఎవరూ అతీతులు కాదు. ఈ విషయం మన ఇప్పుడు మన జగనోరికి అర్థమైనట్లుంది. స్థానిక సంస్థలు ఎన్నికల వివాదంలో సుప్రీంకు వెళ్లినా వైసీసీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బే తగిలింది. ఈసీదే పైచేయిగా నిలిచింది. దీంతో ఈ రోజు పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఇక ఇప్పుడు జగన్ సర్కార్ కచ్చితంగా ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ తంతుతో మరోసారి రాష్ట్రానికి ఈసీనే సుప్రీం అనే విషయం రుజువైంది.

ఇప్పుడు జగన్ సర్కార్ మాత్రమే కాదు.. అప్పట్లో ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఈసీతో ఇలాంటి వివాదాలే తలెత్తాయి. తనకిష్టమైన అధికారినిబదిలా చేయాల్సి రావడంతో దానికి వైఎస్ అంగీకరించలేదు. ‘మీకు చేతనైంది చేసుకోండి.. నేను బదిలీ చేయనం’టూ తేల్చి చెప్పారు. 2006లో జరిగిన విశాఖ అసెంబ్లీ ఎన్నికల సమయంనాటి ఉదంతం ఇది.

విశాఖ అసెంబ్లీ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ విడుదలైంది. అప్పటికే పోలింగ్‌ బూత్‌ అధికారుల జాబితాకు ఈసీ ఆమోదం తెలిపింది. ప్రవీణ్‌ ప్రకాశ్‌ రిటర్నింగ్‌ అధికారి(కలెక్టర్‌)గా ఉన్నారు. ఆయన వైఎస్‌కు ప్రీతిపాత్రుడు. నోటిఫికేషన్‌ విడుదలపై అధికారులతో ప్రవీణ్ ప్రకాశ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓ అధికారిపై కొన్ని ఫిర్యాదులు, అభియోగాలు వచ్చాయి. దీంతో ఆ అధికారిని పోలింగ్‌ అధికారుల జాబితా నుంచి తొలగిస్తూ ప్రవీణ్‌ ప్రకాశ్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇది తెలిసి ఎలక్షన్ కమిషన్‌ ఆగ్రహించింది.

అప్పటి ఎన్నికల కమిషన్‌ డిప్యూటీ కమిషనర్‌ బాలకృష్ణ పిళ్లై ప్రవీణ్‌ప్రకాశ్‌కు నేరుగా ఫోన్‌ చేశారు. ‘ఈసీ ఆమోదం పొందాక జాబితాను మీ ఇష్టం వచ్చినట్లు మార్చడం కుదరదు. మళ్లీ సవరణలు ప్రతిపాదించి ఆమోదం పొందాల్సి ఉంటుంది’ అని ఆదేశించారు. దీనికి ప్రవీణ్‌ ప్రకాశ్‌ పట్టించుకోకుండా కొంత నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. దీంతో వెంటనే ఆయనపై బాలకృష్ణ నుంచి ఈసీకి ఫిర్యాదు వెళ్లింది. ఫిర్యాదు అందుకున్న ఈసీ వెంటనే ప్రవీణ్ ప్రకాశ్‌ను బదిలా చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. ప్రవీణ్ ప్రకాశ్ రిటర్నింగ్‌ అధికారిగా ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని, అధికారుల సూచనలను ధిక్కరించారని, అందువల్ల ఆయన ఎన్నికల విధులకు అనర్హుడని, తక్షణమే బదిలీ చేయాలని ఆ ఆదేశాల్లో పేర్కొంది. అయితే దీనిపై సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి మండిపడ్డారు. అంతా వారి(ఈసీ) ఇష్టమేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే తనకిష్టమైన అధికారి కారవడంతో అతడిని మార్చడం కుదరదని భీష్మించుకు కూర్చున్నారు.

అయితే దీనికి సీఎస్ ఒప్పుకోలేదు. ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు ఈసీయే సుప్రీం అని, ప్రభుత్వం వారితో ఘర్షణకు దిగితే కచ్చితంగా నష్టం వాటిల్లుతుందని, ఇది జాతీయ సమస్యగా మారుతుందని వైఎస్‌ను హెచ్చరించారు. అతడిని బదిలీ చేయడమే ఉత్తమమని సూచించారు. సీఎస్‌ మాటను గౌరవించిన వైఎస్‌ కూడా ప్రవీణ్‌ ప్రకాశ్‌ను బదిలీ చేసేందుకు అంగీకరించారు. అనంతరం ఎన్నికల విధుల నుంచి ఆయనను తొలగించి పశ్చిమగోదావరి కలెక్టర్‌గా బదిలీ చేశారు.

2008లోనూ వైఎస్ హయాంలోనే ఇలాంటి మరో సంఘటన జరిగింది. అప్పుడు కూడా ప్రవీణ్‌ ప్రకాశ్‌ చుట్టూనే వివాదం చెలరేగింది. ఆయన అప్పుడు రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌‌గా ఉన్నారు. దాని పరిధిలోని వికారాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు వచ్చాయి. కలెక్టర్‌గా ఉన్న ప్రవీణ్‌ ప్రకాశ్‌ను బదిలీ చేయాలని ఎన్నికల కమిషన్‌ 2008 ఏప్రిల్‌ 26న ఆదేశించింది. ఈ ఆదేశాలకు అడ్డు చెప్పకుండా వైఎస్‌ సర్కారు అమలు చేసింది. ఈసీ ఆదేశాలకు ఎంత గొప్ప అధికారైనా.. ఎంత పటిష్ఠ ప్రభుత్వమైనా తలొగ్గాల్సిందే. ఇప్పుడు జగన్ సర్కార్ విషయంలోనూ అదే జరిగింది. మరో విశేషం ఏంటంటే ప్రస్తుతం సీఎం జగన్‌కు ముఖ్యకార్యదర్శిగా అప్పటి ప్రవీణ్ ప్రకాశ్‌యే విధులు నిర్వర్తిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: