కాంగ్రెస్‌ పార్టీకి పూర్తిస్థాయిలో అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం కుదిరింది. జూన్‌లో అధ్యక్ష ఎన్నిక నిర్వహించాలని సీడబ్ల్యూసీ నిర్ణయించింది. అయితే దీనిపై కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది.  వెంటనే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని కొందరు అభిప్రాయపడగా.. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాతే చూద్దామని మరికొందరు సీనియర్‌ నాయకులు తేల్చి చెప్పారు.

2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌ పార్టీకి సరైన అధ్యక్షుడు లేరు. రాహుల్‌ దిగిపోయిన తర్వాత సోనియా పగ్గాలు అందుకున్నా.. ఆమెను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. అయితే ఈ సమయంలో కొత్త అధ్యక్షుడి ఎన్నికపై కీలక నిర్ణయం తీసుకుంది సీడబ్ల్యూసీ. ఐదు రాష్ట్రాల ఎన్నికల తర్వాత కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు సిద్ధమైంది. జూన్‌లో ఈ ఎన్నికలు ఉంటాయని సీడబ్ల్యూసీ చెప్పింది. ఈ ఏడాదిలోనే తమిళనాడు, పశ్చిమబెంగాల్‌, కేరళ, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి.

కొత్త నాయకుడి ఎన్నికపై సీడబ్ల్యూసీలో వాడివేడి చర్చ జరిగింది. వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఓ వర్గం నేతలు అధిష్టానానికి తేల్చి చెప్పారు. గులాం నబీ ఆజాద్‌, ఆనంద్‌ శర్మ, చిదంబరం, ముకుల్ వాస్నిక్‌ లాంటి నేతలు ఇప్పుడు అధ్యక్షుడిని ఎన్నుకుంటే మంచిదని చెప్పారు. అయితే అశోక్ గెహ్లాట్‌, అమరీందర్‌సింగ్‌, ఏకే ఆంటోని, ఉమెన్‌ చాందీలు మాత్రం దీనిని వ్యతిరేకించారు. రాబోయే ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తర్వాత అధ్యక్షుడి ఎన్నిక నిర్వహించాలని చెప్పారు. దీంతో మెత్తబడ్డ అసంతృప్త నేతలు సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు.

ఈ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ చర్యలను కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఎండగట్టారు. బాలాకోట్ దాడులకు సంబంధించి బయటపడిన వాట్సాప్‌ సందేశాలపై కేంద్రం నిశ్శబ్దాన్ని ఆమె ప్రశ్నించారు. అలాగే వ్యవసాయ చట్టాల విషయంలోనూ కేంద్రంపై విమర్శలు గుప్పించారు. రైతులకు కాంగ్రెస్‌ పార్టీ మద్దతు ఉంటుందన్నారు సోనియాగాంధీ. మూడు చట్టాలను రద్దు చేయాలన్న తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. దీంతో పాటు ఆర్నాబ్‌ వాట్సాప్‌ చాట్‌ లీక్‌పై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేయాలన్న మరో తీర్మానానికి ఆమోద ముద్ర వేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: