రెండు నెలలు గడిచిపోయాయి. 11 విడతలుగా చర్చలు జరిగాయి. కానీ ఏం తేలలేదు. రైతు సంఘాలు, కేంద్రం మధ్య ప్రతిష్టంభనకు ఫుల్‌స్టాప్‌ పడలేదు. మరోవైపు తమ ప్రతిపాదనలకు ఒప్పుకుంటేనే చర్చలంటోంది ప్రభుత్వం. మరోవైపు మూడు చట్టాలను రద్దు చేయకపోతే ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాయి రైతు సంఘాలు. రిపబ్లిక్‌ డే పెరెడ్‌కు రైతు సంఘాలు సిద్ధమవుతున్నాయి.

రైతుచట్టాలపై చర్చల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం వ్యవసాయచట్టాలను 12 నుంచి18 నెలల పాటు నిలిపివేసేందుకు సిద్ధమైంది. రైతు సంఘాలు దీనిపై ఆలోచించాలని చెప్పింది. ఈ అంశంపైనే పదకొండో విడుత చర్చలకు రెడీ అయింది. అయితే శుక్రవారం జరిగిన చర్చల్లో మరింత కఠినవైఖరి తీసుకుంది కేంద్రం. తమ ప్రతిపాదనలకు ఒప్పుకుంటేనే చర్చలు జరపుతామని లేకుంటే లేదని వ్యవసాయశాఖ మంత్రి తోమర్‌ రైతు సంఘాలకు తేల్చి చెప్పారు.

కేంద్రంతో చర్చలకు రైతుసంఘాల నేతలు ఐదు గంటలకు పైగా విజ్ఞాన్ భవన్‌లోనే ఉన్నారు. దీంతో సుధీర్ఘంగా చర్చలు జరిగాయని భావించినా.. మంత్రులు, రైతులు కేవలం 30 నిమిషాల పాటే ముఖాముఖిగా మాట్లాడుకున్నట్లు చెబుతున్నారు. వ్యవసాయ చట్టాల అమలును ఏడాదిన్నరపాటు వాయిదా వేయాలన్న అంశంపై మాత్రమే చర్చించేందుకు సిద్ధమని తోమర్‌ స్పష్టం చేశారు. రైతులకు తాము మంచి ఆఫర్‌ ఇచ్చామని.. దీనిని కాదంటే ఇక చర్చలు అవసరం లేదని స్పష్టం చేశారు.

వ్యవసాయ చట్టాల అమలును నిలిపివేయడం అంటే చట్టాల్లో లోపం ఉందని కాదన్నారు తోమర్‌. అయితే కేంద్రం ఇక చర్చల్లేవంటూ చెప్పడం ఆసక్తికరంగా మారింది. రైతు సంఘాలు మాత్రం చట్టాలను రద్దు చేయాలన్నదే తమ డిమాండ్‌ అని తేల్చిచెప్పారు. కేంద్రం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతుసంఘాలు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రిపబ్లిక్‌ డే నాడు ట్రాక్టర్‌ ర్యాలీ యాథావిధిగా ఉంటుందని చెప్పారు.  

మొత్తానికి రైతులు గణతంత్ర దినోత్సవానికి ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహించేందుకు సిద్ధమైపోయారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విముఖత చూపడంతో ఈ నిర్ణయానికి వచ్చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: