ఆంధ్రప్రదేశ్ లో అకాల వర్షాలకు ముఖ్యంగా పంటలు దెబ్బతిన్నాయి. రాష్ట్రంలోని 11 జిల్లాల్లో 2.21 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగినట్టు అధికారుల అంచనా. తూర్పుగోదావరి జిల్లాలోనే అత్యధికంగా లక్ష ఎకరాల వరి నీట మునిగింది. పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో కూడా నష్టం ఎక్కువగా ఉంది. కృష్ణా, గుంటూరు, విజయనగరం జిల్లాలతో పాటు పలుచోట్ల 33వేల ఎకరాల పత్తి దెబ్బతింది. ఉద్యానశాఖ పరిధిలో రూ.50 కోట్ల వరకు విలువ చేసే 25వేల ఎకరాలకుపైగా పంట నష్టపోయినట్లు అంచనా.
తీవ్ర వాయుగుండం తెచ్చిన ఉపద్రవం నుంచి రైతులు, లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంకా తేరుకోలేదు. ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా, గుంటూరు సహా రాష్ట్రంలోని ఏడు జిల్లాలు వరదలతో అల్లాడుతూనే ఉన్నాయి. పంటలు మునిగి రైతన్నలు లబోదిబోమంటున్నారు. ఇళ్లు కోల్పోయిన నిరుపేదల కష్టాలు వర్ణనాతీతం. తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా ఏలేరు జలాశయం దిగువ ప్రాంతాల్లో పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రధాన కాలువకు అనుసంధానంగా ఉన్న కాలువలకు 34 చోట్ల గండ్లు పడ్డాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమం అయ్యాయి. జిల్లాలో 39,346 హెక్టార్లలో వ్యవసాయ పంటలు, 3,150 హెక్టార్ల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయని ప్రాథమిక అంచనా.

అటు రోడ్లు కూడా తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఏపీలో 216 జాతీయ రహదారిపై వరదతో రాకపోకలు స్తంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా 2,346 కి.మీ. మేర ఆర్ అండ్ బి రహదారులు ధ్వంసమయ్యాయని అధికారుల అంచనా. 150 కి.మీ. పంచాయతీరాజ్‌ రహదారులు గుంతలమయమయ్యాయి. కాజ్‌వేలు కొట్టుకుపోయాయి. శాఖపట్నం జీవీఎంసీ పరిధిలో రహదారులు, తాగునీటి మార్గాలు 111 కి.మీ. మేర దెబ్బతిన్నాయి. యలమంచిలిలో 6 కి.మీ.రహదారి దెబ్బతింది.

ప్రధానంగా ఏపీలో వ్యవసాయ రంగానికి వేలకోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలుస్తోంది. ఆక్వా రంగంలో 7,437 ఎకరాల్లో చెరువులు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా గుర్తించారు. విశాఖ, తూర్పుగోదావరి జిల్లాల్లో వలలు, పడవలు కొట్టుకుపోయి రూ.1.17 కోట్ల నష్టం వాటిల్లింది. వరదలతో ఏపీ మొత్తం తీవ్రంగా నష్టపోయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: