ఈ దేశంలో బాగా ఎక్కువగా డబ్బు సంపాదించే వృత్తి ఏది అంటే ఎన్నో సమాధానాలు వస్తాయి. కానీ.. లాజిక్కులతో.. అపార న్యాయజ్ఞానంతో వాదించే లాయర్లు కూడా అత్యధిక సంపాదనపరుల జబితాలోకి వస్తారు. సుప్రీంకోర్టులో వాదించే కొందరు లాయర్లు గంటలు లెక్కన కూడా కేసులకు ఫీజులు వసూలు చేస్తుంటారు. అందుకే కీలక కేసులు ఎక్కువగా వారి వద్దకు వెళ్తుంటాయి. అయితే చండీగఢ్ కు చెందిన ఓ న్యాయవాది సంపాదన ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.

ఎందుకంటే ఆయన రెండు కేసులకు ఏకంగా 217 కోట్ల రూపాయలు వసూలు చేశాడు.. అవును.. నిజం ఈ విషయంపై నమ్మకం కలగడం లేదు కదా.. కానీ నమ్మాల్సిందే ఎందుకంటే.. ఈ విషయం బయటపెట్టింది సదరు న్యాయవాది కాదు.. ఆదాయ పన్ను శాఖ.. అవును.. కక్షిదారుల నుంచి ఒక్కో కేసుకు ఫీజుల రూపంలో వందల కోట్ల రూపాయలు వసూలు చేస్తూ  పన్ను ఎగవేతకు పాల్పడుతున్న ఓ ప్రముఖ న్యాయవాది తాజా ఆదాయపన్ను శాఖకు చిక్కారు. అయితే ఆ న్యాయవాది వివరాలు మాత్రం వారు వెల్లడించలేదు.

ఇక వివరాల్లోకి వెళ్తే.. ఈ న్యాయవాది ఇటీవల రెండు కేసులకు సంబంధించి 217 కోట్ల రూపాయలను ఫీజుగా స్వీకరించాడట.  ఈ విషయాన్ని స్వయంగా ఆదాయపన్ను శాఖ వర్గాలు తెలిపాయి. అయితే సదరు బిజినెస్ మెన్ పేరు మాత్రం బయటపెట్టలేదు. హరియాణా, దిల్లీ, దేశ రాజధాని ప్రాంతాల్లోని ఆయనకు చెందిన 38 ప్రాంగణాల్లో సోదాలు నిర్వహించి 5కోట్ల 50లక్షల రూపాయల నగదును జప్తు చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు  తెలిపింది. ఓ కేసులో కక్షిదారు నుంచి 117 కోట్ల రూపాయలను నగదు రూపంలో తీసుకున్న న్యాయవాది.... చెక్కు ద్వారా అందుకున్న 21కోట్ల రూపాయలను మాత్రమే ఆదాయపన్ను శాఖకు చూపించారు.

అలాగే  మరో కేసులో ఓ ప్రభుత్వ రంగ సంస్ధతో మధ్యవర్తిత్వం నెరిపేందుకు ఓ ఇంజనీరింగ్  సంస్ధ నుంచి వంద కోట్ల రూపాయలకు పైగా సొమ్మును నగదు రూపంలో స్వీకరించారు. ఈ న్యాయవాది, ఆయన అసిస్టెంట్లు  వందల కోట్ల రూపాయలతో భూములు, పాఠశాలలు కొనుగోలు చేసినట్లు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: