ప్రపంచ దేశాల సైన్యాలలో భారతదేశ సైన్యం విభిన్నం. ఎందుకంటే సందర్భానుసారంగా వీరత్వంతో పాటు నిబద్ధత, నైతిక విలువలు పాటించడమే భారతదేశ సైన్యం యొక్క ప్రత్యేకత. శత్రువైనా సైనికుడికి తగిన గౌరవం దక్కాలనేది భారత అభిమతం. తాజాగా, జరిగిన ఓ ఘటనే దీనికి నిదర్శనం. దెబ్బతిన్న పాకిస్థాన్ సైనిక అధికారి సమాధిని భారత సైన్యం పునరుద్దరించింది. ఈ విషయాన్ని భారత సైన్యం గురువారం తెలిపింది. నౌగమ్ సెక్టార్‌‌లో పాక్ సైనికాధికారి మేజర్ మొహమూద్ షబీర్ ఖాన్ సమాధిని పునరుద్దరించిన ఫోటోలను ఆర్మీ షేర్ చేసింది. ఎల్ఓసీ వద్ద 1972 మే 05న ప్రాణాలు కోల్పోయిన మేజర్ మొహమద్ షబీర్ ఖాన్ జ్ఞాపకార్థం.. సితార్-ఎ-జుర్రత్ షాహిద్ సమాధిని పునరుద్దరించాం’ అని చీనార్ కార్ప్స్ షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


‘ఇండియన్ ఆర్మీ సంప్రదాయాలు, నైతిక నియమాలు అనుసరించి చినార్ కార్ప్స్.. ఎల్ఓసీ వెంబడి నౌగమ్ సెక్టార్‌ వద్ద 1972 మే 05న చనిపోయిన పాక్ ఆర్మీ మేజర్ మొహమద్ షబీర్ ఖాన్‌కు చెందిన సితార్-ఎ-జురాత్ సమాధిని పునరుజ్జీవింపజేసింది’ అని తెలిపింది. అమరుడై సైనికుడి దేశంతో సంబంధం లేకుండా మరణంలోనూ గౌరవానికి అర్హుడు. ఇండియన్ ఆర్మీ దీనిని బలంగా నమ్ముతుంది.. ఇది ప్రపంచానికి ఆదర్శం’ అని పేర్కొంది.  ఓ సైనికుడి ధైర్యాన్ని గుర్తించి, ఆతని వీరత్వాన్ని గౌరవించాలని అతడి అధికారులకు శత్రు సైన్యం చెప్పడం చాలా అరుదు. అయితే, 1999 కార్గిల్ యుద్ధంలో టైగర్ హిల్ సరిహద్దులో పాక్ కెప్టెన్ కల్నల్ షేర్ ఖాన్ చూపిన ధైర్యసాహసాలతో ఇలాంటి ఘటనే జరిగింది. కెప్టెన్ షేర్ ఖాన్ మృతదేహాన్ని అప్పగించేటప్పుడు, 12 ఎన్ఎల్ఐకి చెందిన కెప్టెన్ కల్నల్ షేర్ ఖాన్ చాలా ధైర్యంగా పోరాడారు.. ఆయనకు తగిన గౌరవం, గుర్తింపు దక్కాలి" అని ఓ చీటీ మీద రాసి మృతదేహానికి వేసిన దుస్తుల జేబులో భారత్‌కు చెందిన సైనికాధికారులు ఉంచారు.



మరింత సమాచారం తెలుసుకోండి: