మెల్లగా దేశం జమిలి ఎన్నికల వైపుగా సాగుతోంది.  వాస్తవానికి ఇది బీజేపీ ఆలోచన. దానికి ఇంతకాలం సమయం పట్టింది. మోడీ సర్కార్ మొదటిసారి అధికారంలోకి వచ్చినపుడే జమిలి ఎన్నికల గురించి ఆలోచన చేశారు. కానీ ఎందుకో అది కుదరలేదు. ఇపుడు పెద్దల సభలో మెజారిటీ పూర్తిగా  వస్తోంది. పైగా లోక్ సభలో తిరుగులేని ఆధిక్యత ఉంది. దేశంలో విపక్షాలు కొంత బలహీన పడ్డాయి. దాంతో ఇపుడు కాకపోతే మరెపుడు అన్న తీరున మోడీ సర్కార్ జమిలి ఎన్నికలకు తెర తీస్తోంది. దానికి నాంది అన్నట్లుగా ఒకే ఒక ఓటర్ లిస్ట్ ని దేశమంతా వర్తింప చేయాలనుకుంటోంది.

అంటే కేంద్ర ఎన్నికల సంఘం వద్ద ఉన్న ఓటర్ లిస్టే ఏ రాష్ట్రానికైనా ప్రమాణం కావాలి. ఇప్పటిదాకా లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా ఓటర్ల జాబితాను తయారు చేసుకుంటున్నాయి. కానీ ఇకపైన ఓటర్ల జాబితా ఒక్కటే ఉంటుంది. అది మారదు, అయితే దీని మీద చాలా రాష్ట్రాలు అభ్యంతరాలు వ్యక్తం చేసినా కూడా దూకుడుగా ముందుకు సాగిపోవాలని మోడీ సర్కార్ అనుకుంటోందిట.

దీనికి సంబంధించి రాజ్యాంగంలోకి 243కె, 243 జెడ్ ఏ లను సవరించాలని కూడా భావిస్తోంది. ఆ ప్రక్రియ కనుక పూర్తి అయితే జమిలి ఎన్నికలకు వేగంగా అడుగులు పడినట్లే. ఇక 2022 నుంచి 2024లోగా అనేక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో వాటిని ముందుకు తోసి అయినా లేక వాయిదా వేసి అయినా దేశమంతటా ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలని  కేంద్రం భావిస్తోంది అంటున్నారు. 2022లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాంచల్, పంజాబ్, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికలు జరగనున్నాయి. అదే విధంగా 2023లో తెలంగాణాతో పాటు అనేక రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి. దాంతో జమిలి ఎన్నికల విషయంలో కేంద్రం కీలకమైన నిర్ణయం తీసుకునే విధంగా అడుగులు వేస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: