రైతుల కన్నీరు రాష్ట్రానికి మంచిది కాదు అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. పాదయాత్రలో తమది రైతు రాజ్యం అని చెప్పిన జగన్ ఇపుడు రైతు లేని రాజ్యం తెస్తున్నారని ఆయన పేర్కొన్నారు. జగన్ పాలనలో రైతులు చాలామంది చనిపోయారని అయన ఆవేదన వ్యక్తం చేసారు. వరదలు వస్తే ఇక్కడ కనీసం సహాయ చర్యలు లేవని పేర్కొన్నారు. ప్రభుత్వ యంత్రాంగం కనీసం స్పందించడం లేదని తెలిపారు. వరద వస్తుందని తెలిసినా ముఖ్యమంత్రి కనీసం సమీక్ష చేయలేదని ఆయన మండిపడ్డారు.

ప్రధాని ఫోన్ చేసిన తర్వాతే ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారని  ఆయన ఆరోపించారు. అసెంబ్లీలో మాట్లాడే మంత్రిగారు ఇక్కడకు వచ్చి వాస్తవాలు చూడాలని అన్నారు. రైతుల ఇబ్బందులను కన్నబాబు పరిశీలించాలని ఆయన హితవు పలికారు. కనీసం రైతులకు పెట్టుబడి రాయితీ ఇవ్వడం లేదని ఆయన అన్నారు.  హుద్ హుద్ సమయంలో రెండు రోజుల్లో విశాఖలో విద్యుత్ పునరుద్ధరణ చేశాం అని  లోకేష్ చెప్పుకొచ్చారు. కానీ ఇపుడు కరెంటు పోతే ఎపుడు వస్తుందో తెలియదు అని ఆవేదన వ్యక్తం చేసారు.

అడుగడుగునా రైతులను అవమానించేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని  మండిపడ్డారు. ఇపుడు ఉచిత విద్యుత్ ఎత్తి వేసేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆయన విమర్శించారు. అందుకే మీటర్లు పెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగుదేశం పార్టీ దీనిపై గట్టిగా పోరాడుతుందని ఆయన స్పష్టం చేసారు. గతేడాది వరద నష్ట పరిహారం ఇంకా ఇవ్వలేదని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో మొత్తం కలిపి 25 లక్షల రూపాయలు పరిహారం ఇస్తే సరిపోతుందా అని ఆయన ప్రశ్నించారు. వరదల పై ముఖ్యమంత్రి ముందుగా సమీక్ష చేసి ఉంటే ఇపుడు ఇబ్బందులు తప్పేవని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి ఎందుకు బయటకు రావటం లేదని ఆయన నిలదీశారు. వరద ప్రాంతాల్లో ఎందుకు పర్యటించటం లేదని ప్రశ్నించారు. సాగు నీటి మోటార్లకు మీటర్లు బిగించటాన్ని తెదేపా అంగీకరించదని స్పష్టం చేసారు. రైతుల తరఫున మేం పోరాటం చేస్తాం అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: