కరోనా వైరస్. భారతదేశాన్ని కమ్ముకుంది. అలా ఇలా కాకుండా కుమ్మేసింది. కరోనా ఈ మూడు అక్షరాలు వింటే చాలు హడల్ అన్న సీన్ కనిపించింది. కరోనా గురించి కనీసం వైద్యులకు కూడా తెలియని రోజుల్లో రోగులు అలా ఆసుపత్రి దాకా వచ్చి కూడా మెట్ల మీద పడి మరణించిన దారుణమైన దృశ్యాలు ఎన్నో కనిపించాయి. కరోనాను తలచుకుని వగచి వాపోయిన వారంతా  బిక్కుబిక్కుమని గడిపారు. అసలు దానికి ఫలనా అని ఒక  మందు కూడా లేదు, ఏం చేయాలో డాక్టర్లకు కూడా తెలియదు. కానీ వెల్లువలా కరోనా వచ్చేసి అంతటా వ్యాపించేసింది.

ఆ సమయంలో దేశంలో వెంటిలేటర్లు కూడా ఎక్కువగా లేవు.  దాని మీద అంతర్జాతీయ  పరిశోధకులు అన్న మాట భారత్ లో కరోనా కనుక వస్తే వెంటిలేటర్ల కొరత తీవ్రంగా ఉంటుంది. దాంతో చాలా మంది ముందే చనిపోతారని, అయితే దేశంలో చాలా రాష్ట్రాలు వెంటిలేటర్ల కొరత రాకుండా అప్పటికపుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి. అందులో ఆంధ్ర ప్రదేశ్ కూడా ఉంది. రాష్ట్రంలో మార్చిలో కరోనా ఎంట్రీ ఇచ్చింది. అపుడు ఏపీలో  కనీసం పదుల సంఖ్యలో కూడా వెంటిలేటర్లు లేవు. కానీ ఆ తరువాత అయిదు వేల వరకూ వెంటిలేటర్లు సమకూర్చుకుంది ప్రభుత్వం

ఇక మూడు నెలల పాటు ఒక దశలో సాగిన కరోనా ఆ తరువాత జూలై, ఆగస్ట్ నెలల్లో మాత్రం వీర విహారమే చేసింది. దాంతో కరోనా బారిన పడి చనిపోయిన వారి సంఖ్య ఈ రెండు నెలల్లోనే ఎక్కువగా ఉంది. జూలై వరకూ ఏపీలో లక్షా 20 వేల  కేసులు ఉంటే అవి ఆరు లక్షల దాకా ఈ రెండు నెలల్లోనే చేరాయి. అయితే సెప్టెంబర్ నుంచి కరోనా క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఇపుడు సగానికి సగం నెమ్మదించింది. దీంతో వెంటిలేటర్లు కూడా ఏపీలో సగానికి పైగా ఖాళీ అయిపోయాయి.


ఒకపుడు వెంటిలేటర్ల కోసం రికమెండ్ చేయించుకునే స్థితి నుంచి ఇపుడు వెంటిలేటర్లు ఖాళీగా ఉంటూ కరోనాను వెక్కిరించిన స్థితిదాక ఏపీ వచ్చేసింది. ఇదిలా ఉంటే కరోనాను ఎదుర్కొనే యాంటీ బాడీస్ కూడా మనుషుల్లో డెవలప్ అయ్యాయని అది కూడా కరోనా మహమ్మారి వెనక్కి తగ్గడానికి కారణం ఏపీ కరోనా నోడల్ అధికారి రాంబాబు అంటున్నారు. మొత్తం మీద కరోనా ఏపీలో తగ్గుముఖం పడుతోంది. ఇదే విధంగా ఉంటే మరి కొద్ది నెలల్లో రాష్ట్రం సాధారణ స్థితికి వస్తుందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: