ఇంతకు ముందు భారత్ కు ప్రధాన శత్రువు ఎవరంటే.. ముందుగా వచ్చే సమాధానం  పాకిస్తాన్ అని.. కానీ ఇప్పుడు సీన్‌ పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు భారత్ పక్కలో బల్లెంలా చైనా మారిపోయింది. సరిహద్దుల వద్ద కయ్యానికి కాలుదువ్వుతోంది. అది లద్దాఖ్ కానీ.. అరుణాచల్ ప్రదేశ్ కానీ.. ప్రాంతం ఏదైనా ఎల్లల్లో చైనా బరి తెగిస్తోంది. అంతే కాదు.. దౌత్య పరంగానూ ఇతర విషయాల్లో తరచూ జోక్యం చేసుకుంటోంది. తాజాగా.. మరో కొత్త వివాదానికి చైనా తెర తీసింది. కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ ను తాము గుర్తించడం లేదని కామెంట్ చేసింది.

ఇటీవల లద్ధాక్  సరిహద్దుల్లో కొన్ని వంతెనలను రక్షణమంత్రి  రాజ్‌ నాథ్ సింగ్ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో లద్ధాక్ ను, అరుణాచల్ ప్రదేశ్ ను తాము గుర్తించడం లేదని ఆ ప్రాంతంలో భారత్ అక్రమ నిర్మాణాలు చేస్తోందని చైనా ఆక్షేపించింది. దీంతో భారత్ కూడా చాలా దీటుగానే స్పందించింది. కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము-కశ్మీర్ , లద్ధాఖ్ ఎప్పటికీ భారత్ లో అంతర్భాగమేనని  కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మరోసారి తెగేసి చెప్పింది.. గట్టిగా స్పష్టం చేసింది. భారత అంతర్గత విషయాల్లో చైనాకు కలుగ చేసుకోవాల్సిన అగత్యం అస్సలులేదని భారత్ తేల్చిచెప్పింది.

కేంద్ర పాలిత ప్రాంతం లద్ధాఖ్ తో పాటు అరుణాచల్ ప్రదేశ్ ను తాము గుర్తించడం లేదంటూ.. చైనా చేసిన వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాలశాఖ అధికారప్రతినిధి అనురాగ్ శ్రీవాత్సవ ఈ మేరకు తీవ్రంగా స్పందించారు. తమ సొంత విషయాల్లో కలుగచేసుకోకూడదని  ఆయా దేశాలు ఎలా కోరుకుంటాయో  ఆ తరహాలోనే భారత్ విషయాల్లో కలుగచేసుకోకుండా ఉండడం అందిరికీ మంచిదని గట్టిగానే చైనా కు వార్నింగ్ ఇచ్చేశారు. అరుణాచల్ ప్రదేశ్  కూడా సమగ్ర భారతంలో  ఓ భాగమని దానిని ఎవరూ భారత్  నుంచి విడతీయలేరని  అనురాగ్ స్పష్టం చేశారు.


అరుణాచల్ ప్రదేశ్ విషయంలో  ఇప్పటికే చైనాకు ఎన్నోసార్లు తేల్చిచెప్పామని.. అత్యున్నతస్థాయిల్లో కూడా ఈ విషయంపై స్పష్టత ఇచ్చామని పేర్కొన్నారు. అంతే కాదు.. భారత్ తమతో చర్చలకు సంప్రదింపులు జరుపుతోందంటూ పాక్ విదేశీ వ్యవహారాల శాఖ చేసిన ప్రకటనను కూడా అనురాగ్ శ్రీవాత్సవ ఖండించారు. చర్చల ప్రతిపాదనేదీ  తాము చేయలేదని.. ఇస్లామాబాద్ అబద్ధపు ప్రచారాలు చేసుకుంటోందని మండిపడ్డారు. మొత్తానికి అటు పాక్, ఇటు చైనా భారత్‌ కు పక్కలో బల్లేల్లా తయారయ్యాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: