తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత రాష్ట్ర ప్రభుత్వ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేసారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన దిశ బిల్లులో చాలా లోపాలున్నాయని కేంద్రం వెనక్కి పంపిందని ఆమె చెప్పారు. లోపాలతో బిల్లులు చేసి ఆమోదించపోతే తప్పు కేంద్రంపై నెట్టాలని చూస్తున్నారా? అని ఆమె నిలదీశారు. దిశ చట్టం ఆమోదం పొందకుండానే అత్యాచార ఘటనలలో దిశ చట్టం కింద కేసు ఎలా నమోదు చేశారు..? అని ప్రశ్నించారు.బిల్లు ఆమోదం పొందకుండానే రాజమండ్రిలో ఆర్భాటంగా దిశ పీఎస్ ఏర్పాటు చేయడం మీ ప్రచార ఆర్భాటానికి నిదర్శనం కాదా.? అని  ఆమె ప్రశ్నించారు.

ప్రచారంపై చూపిస్తున్న శ్రద్ధ.. మహిళల భద్రతపై ఎందుకు చూపడం లేదు..?  అని నిలదీశారు. ఇన్నాళ్లు పురుషులు మహిళల్ని మోసం చేయడం చూసాం అన్న అనిత... ఇప్పుడు ప్రభుత్వమే మహిళల్ని మోసం చేయడం చూస్తున్నాం అని మండిపడ్డారు. మీ ప్రచారం కోసం అత్యాచారాలకు గురైన మహిళల్ని కూడా మోసం చేయడం సిగ్గుమాలిన చర్య అని ఆమె ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వ ఉదాసీనత వైఖరి వల్లే రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు రక్షణ లేకుండా పోయిందని ఆమె విమర్శించారు.

ముఖ్యమంత్రి నివాసానికి కూత వేటు దూరంలో వారం రోజుల వ్యవధిలో ఇద్దరు  యువతులు ఉన్మాదుల చేతిలో బలయ్యారని ఆమె ఆరోపించారు. రాష్ట్రంలో ప్రతిరోజూ ఎక్కడో చోట మహిళలపై దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని ఆవేదన చెందారు. మహిళా హోమ్ మంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలపై దాడులు పెరగటం బాధాకరం అని ఆమె అన్నారు. మహిళపై జరుగుతున్న అఘాయిత్యాలపై వైసీపీలోని మహిళా ఎమ్మెల్యేలు, నేతలు ఎందుకు స్పదించటంలేదు..? అని ఆమె ప్రశ్నించారు. దిశ చట్టం గురించి అసెంబ్లీలో గొంతు చించుకుని గొప్పలు చెప్పిన రోజా.. ఇప్పుడేందుకు నోరు మెడపటం లేదు? అని ఆమె నిలదీశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: