జగన్ గద్దెనెక్కిన నాటినుంచే దిగిపో అంటూ విపక్షం గోల చేస్తోంది. అసలు జగన్ సీఎం కావడం ఏపీలోని కొన్ని వర్గాలకు సుతరామూ ఇష్టం లేదన్న సంగతి తెలిసిందే. ఒక ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించే వార్త ఒకటి వస్తే కనీసం దానిని ప్రచురించకుండా పక్కన పడేసిన మీడియాను ఎక్కడైనా చూశారా. ఏపీలో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా పోకడలు చాలా దారుణం కూడా. ముఖ్యమంత్రికి సంబంధించిన వార్తలను ఎక్కడో ఒక మూల వేయడం, ఆయన్ను విమర్శించే వార్తలను మాత్రం మొదటి పేజీలో వేయడం అంతా చూస్తూనే ఉన్నారు.

ఇకక్డ ముఖ్యమంత్రి అంటే ఒక పార్టీగా తమకు శత్రువుగా చూస్తున్నారు కానీ ఆయన చెప్పే విషయాలు, చేసే సమీక్షలు కూడా ప్రజలకు ఉపయోగపడేవే. మరి ఆయన ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా లేదా అన్నది సదరు మీడియా యాజమాన్యాలే చెప్పాలి. ఇదిలా ఉంటే ఇపుడు సరికొత్త ప్రచారం మొదలుపెట్టారు. అదేంటి అంటే జగన్ దిగిపోతాడని, ఆయన స్థానంలో కొత్త సీఎం వస్తున్నారు అని.

అసలు ఎందుకు ఇలా జరుగుతుంది అంటే సీబీఐ కోర్టులో జగన్ కేసులు రోజు వారీ విచారణ జరుగుతున్నాయి. అవి కచ్చితంగా అలా జోరు మీద సాగితే జగన్ కేసులలో వచ్చే ఏడాది  ప్రధమార్ధానికల్లా తీర్పులు వచ్చేస్తాయట. మరి అవి కనుక వస్తే జగన్ కి ఇబ్బంది అని ఆయన మీద బలమైన వ్యతిరేక సాక్ష్యాలు ఉన్నాయని కూడా అంటున్నారు. మరి జగన్ ఆ కేసులలో బుక్ అయితే కచ్చితంగా పదవి నుంచి దిగిపోతారని మాజీ ఎంపీ సబ్బం హరి చెబుతున్నారు.

మరో వైపు సుప్రీం కోర్టు న్యాయమూర్తి మీద జగన్ ఫిర్యాదు చేయడం ద్వారా కోర్టు ధిక్కారానికి పాల్పడ్డారని, అందువల్ల ఆయనకు శిక్ష తప్పదని రెబెల్ ఎంపీ రఘురామ క్రిష్ణం రాజు అంటున్నారు. మరి ఈ రెండు విషయాల్లో జగన్ ఎంతవరకూ ఇబ్బందుల్లో పడతారు, ఆయనకు ఎంతవరకూ బయటపడే అవకాశాలు ఉన్నాయి అంటే దాని మీద భిన్నాభిప్రాయాలను న్యాయనిపుణులు చెబుతున్నారు.


జగన్ కేసుల విషయంలో ఏం జరుగుతుందో ఎవరూ జోస్యం చెప్పాల్సిన పని లేదని కడిగిన ముత్యంలా బయటకు వస్తారని వైసీపీ నేతలు నమ్ముతున్నారు. అదే సమయంలో జగన్ న్యాయ వ్యవస్థలను ధిక్కరించలేదని విన్నపాలు మాత్రమే చేశారని అంటున్నారు. మొత్తానికి జగన్ దిగిపోవాలంటూ మొదటి నుంచి టీడీపీ కానీ దాని అనుకూల మీడియా కానీ పడుతున్న ఆరాటానికి తాజా పరిణామాలను జోడించి విపరీత  ప్రచారం చేస్తున్నారు అంటున్నారు. మరి చూడాలి ఏం జరుగుతుందో.

మరింత సమాచారం తెలుసుకోండి: