మాజీ మంత్రి... టీడీపీ సీనియర్ నేత నిమ్మకాయల చినరాజప్ప రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. నిర్లక్ష్య విధానాల వల్లే వరద కష్టాలని ఆయన ఆరోపించారు. భారీ వర్షాల కారణంగా ఏర్పడిన వరద ప్రభావిత ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించకుండా జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మరియు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు గారు కరకట్ట పై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నివాసం గురించి, ఆయనను విమర్శించడంలోనే సమయం వృధా చేస్తున్నట్టుగా విమర్శించారు. ప్రకృతి కన్నెర్ర చేయడంతో వేలాది ఎకరాల్లో పొట్ట దశలో ఉన్న వరి పొలాలు దెబ్బతిని రైతులు ఆవేదన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు.

రైతులకు పంట నష్ట పరిహారంగా భీమా చేయబడినది అన్నారని... అది ఎంత వరకు సాకారం అవుతుందో తెలియదని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో గోదావరి, కృష్ణా, ఏలేరు, నాగావళి, తుంగభద్ర నదులు, వాగులు, వంకలు పొంగి పోర్లుతున్నాయి. నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయని అన్నారు. వేలాది ఎకరాల్లో వేసిన వరి, కంద, పసుపు, అరటి, మినుము, పెసర పంటలు నీట మునిగాయని ఆయన వ్యాఖ్యానించారు.

వందలాది ఇళ్లు వరద నీటిలో చిక్కుకున్నాయని అన్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన వరదలకు, భారీ వర్షాలకు, తుఫానుల కార‌ణంగా  రైతులు మూడు సార్లు నష్టపోయారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని తెలిపారు.. అదే విధంగా ముంపు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు. క్షేత్రస్థాయిలో బాధితులకు ఆహారం, వస్తువులు పంపిణీ చేయాలని కోరారు. ముంపు ప్రభావిత ప్రాంతాల్లో  ఉచిత వైద్య శిచిరాలు ఏర్పాటు చేయాలని అయన విజ్ఞప్తి చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: