జగన్ దూకుడు మీద ఉన్న యువ ముఖ్యమంత్రి. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలకు ఒక్కోసారి అనుకోని ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఈ నేపధ్యంలో జగన్ ఒకింత అసహనానికి కూడా గురి అవుతున్నారు. ఆయన బాధ ఆవేదన నుంచి వచ్చిందే ఒక అసాధారణ నిర్ణయం అని కొందరు అంటున్నారు. ఆయన ప్రజాక్షేమం దృష్టిలో ఉంచుకుని అలా చేశారని సమర్ధించేవారూ ఉన్నారు. ఇవన్నీ పక్కన పెడితే ప్రజలతో నేరుగా పనిచేసే పాలకులకు, రాజ్యాంగాన్ని రక్షించే న్యాయ వ్యవస్థలకు మధ్యన ఘర్షణలు ఈనాటివి కావు అని కూడా తలపండిన వారు చెబుతూంటారు.

నాటి ఇందిరాగాంధీ నుంచి చెప్పుకుంటూ పోతే ఈనాటి జగన్ వరకూ కోర్టు తీర్పుల మీద ఎంతో కొంత అసంత్రుప్తి వ్యక్తం చేసిన వారేనట‌. ఇక ఉమ్మడి ఏపీ సీఎం దామోదరం సంజీవయ్య కూడా నాటి ఉమ్మడి హై కోర్టు చీఫ్ జస్టిస్ మీద ఫిర్యాదుని చేసిన సంగతిని జస్టిస్ రెడ్డప్ప రెడ్డి వంటి వారు ఇపుడు గుర్తు చేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అయితే జగన్ సీజేఐకి లేఖ రాసి దాన్ని మీడియా సమావేశం పెట్టి వెలువరించడం మీద తాజాగా కామెంట్స్ చేశారు.

జనంలోకి  తన అభిప్రాయలను తెలియచేసేందుకే జగన్ అలా చేసి ఉండొచ్చు అని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.  జగన్ ఒక్కడే కాదు, గతంలో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీయార్ కూడా కోర్టులు కొన్ని సార్లు ప్రజాసేవకు అడ్డుపడుతున్నాయని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కొన్ని సార్లు తాము అనుకున్న పనులకు ఎవరో స్టేలు తెచ్చి బ్రేకులు వేస్తే ఇలాగే పాలకులు మధన పడిన సందర్భాలు ఉన్నాయని ఉండవల్లి మాటల ద్వారా తెలుస్తోంది.

ఇవన్నీ పక్కన పెడితే జగన్ చేసినది తప్పా ఒప్పా అన్న దాని మీద కూడా న్యాయ కోవిదులు పలు రకాలుగా స్పందిస్తున్నారు. జగన్ ఒక ముఖ్యమంత్రి అని, ఆయన వ్యక్తిగా ఏంటన్నది ఇక్కడ ప్రధానం కాదని జస్టిస్ రెడ్డప్పరెడ్డి వంటి వారు అంటున్నారు. ఆయన లేవనెత్తిన ఆరోపణల మీద విచారణ జరగాలని కూడా కోరుతున్నారు. ఏది ఏమైనా ఈ విషయంలో స్పందించాల్సింది సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి, లేక కేంద్రంలోని పాలకులు అని కూడా అంటున్నారు. మొత్తం మీద జగన్ కొన్ని విషయాల్లో నాటి సీఎం ఎన్టీయార్ మాదిరిగానే దూకుడుగానే వ్యవహరిస్తున్నారన్నది మరో మారు రుజువు అయింది.





మరింత సమాచారం తెలుసుకోండి: