అనంతపురం జిల్లా...టీడీపీకి కంచుకోట. ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఇక్కడ టీడీపీకి మంచి ఫలితాలు వచ్చేవి. 2014లో సైతం జిల్లాలో ఉన్న 14 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ 12 గెలిస్తే, వైసీపీ రెండు గెలిచింది. రెండు ఎంపీ సీట్లని సైతం టీడీపీనే గెలిచింది. కానీ 2019 ఎన్నికల్లో ఫలితాలు తారుమారయ్యాయి. జగన్ వేవ్‌లో టీడీపీ చిత్తుగా ఓడిపోయింది. టీడీపీ 2 గెలిస్తే, వైసీపీ 12 అసెంబ్లీ, రెండు ఎంపీ సీట్లని గెలుచుకుంది.

అయితే ఎన్నికలై ఏడాదిన్నర దాటేసింది. ఈ ఏడాదిన్నర కాలంలో టీడీపీ కాస్త పర్వాలేదనిపించేలా పనిచేస్తోంది. కొందరు వైసీపీ ఎమ్మెల్యేల మీద వస్తున్న వ్యతిరేకిత టీడీపీకి ప్లస్ అవుతున్నట్లు కనబడుతోంది. ఇదే సమయంలో తాజాగా చంద్రబాబు పార్లమెంట్ స్థానాల వారీగా అధ్యక్షులని నియమించారు. అనంతపురంకు కాల్వ శ్రీనివాసులుని, హిందూపురం స్థానానికి బి‌కే పార్థసారథిని నియమించారు.

ఈ ఇద్దరు నాయకులు సీనియర్లే. ఆది నుంచి టీడీపీలో కష్టపడుతున్న నేతలు. అయితే వీరు టీడీపీని ఏ మేర సెట్ చేయగలరు అంటే? చెప్పలేని పరిస్తితి ఉంది. రెండు పార్లమెంట్ స్థానాల పరిధిలో కొందరు నేతలు పెద్దగా యాక్టివ్‌గా లేరు. అనంతపురం పార్లమెంట్ విషయానికొస్తే..రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్, తాడిపత్రి, శింగనమల, అనంతపురం అర్బన్, కళ్యాణదుర్గం స్థానాలు ఉన్నాయి.

 రాయదుర్గం ఎలాగో కాల్వ శ్రీనివాసులు చూసుకుంటున్నారు. అటు ఉరవకొండలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ యాక్టివ్‌గా లేరు. గుంతకల్‌లో జితేంద్ర గౌడ్, కళ్యాణదుర్గంలో ఉమా మహేశ్వరనాయుడులు పెద్దగా పార్టీలో కనిపించడం లేదు. అటు తాడిపత్రిలో జేసీ అస్మిత్ రెడ్డి, ఇటీవలే జైలు నుంచి వచ్చారు. అర్బన్ స్థానంలో ప్రభాకర్, శింగనమలలో శ్రావణిలు యాక్టివ్‌గానే ఉంటున్నారు.
అటు హిందూపురం పరిధిలో రాప్తాడు, ధర్మవరం, పెనుకొండ, పుట్టపర్తి, కదిరి, హిందూపురం, మడకశిర నియోజకవర్గాలు ఉన్నాయి. హిందూపురం, కదిరిలు కాకుండా మిగిలిన నియోజకవర్గాల్లో టీడీపీ పెద్దగా పుంజుకున్న దాఖలాలు కనిపించడం లేదు. మరి చూడాలి అనంతలో ఈ సీనియర్లు సైకిల్ కష్టపడి తొక్కి, పార్టీని పైకి లేపుతారేమో.

మరింత సమాచారం తెలుసుకోండి: