హైదరాబాద్. విశ్వనగరం. ఇపుడు సీన్ చూస్తే వణుకు పుట్టేలా ఉంది. వెంకటేష్ గౌడ్ అనే ఒక కారున్న ఆసామి తాజాగా వచ్చిన వరదల్లో చిక్కుకుని తనకు కాపాడమంటూ స్నేహితులకు సెల్ ఫోన్ చేసినంతసేపు లేదు, తానూ ఆ  కారూ, ఒక చెట్టుని అడ్డం పెట్టుకున్నా కూడా మొత్తానికి మొత్తం వరదలో మునిగిపోయారు. ఇది హైదరాబాద్ ని కలవర‌పెట్టిన మహా విషాదం. ఇలాంటివి ఎన్నో ఈ మధ్యనే జరిగాయి. వాన వస్తే చాలు  బెంబేలెత్తే పరిస్థితి. వందేళ్లలో కురవని వాన ఒకేసారి సిట్టిని పట్టేసి  32 సెంటీమీటర్లు కురిసింది. కాలనీలను, కార్లను అందరినీ ముంచేసింది. దాంతో ఆకాశం వైపు చూస్తూ ఇపుడు అక్కడ జనం భీతిల్లుతున్నారు.

ఈ నేపధ్యంలో ఇవాళ మళ్లీ వాన కురిసింది. ఇపుడు మరోమారు బిక్కుబిక్కుమనడం జనాల వంతు అయింది. ఇది చాలదు అన్నట్లుగా రానున్న మూడు రోజుల్లో దక్షిణ ఏపీలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ ఎత్తున వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ కావడంతో మళ్ళీ బాదేస్తుందా అని భాగ్యనగర‌వాసులు భయపడిపోతున్నారు.

అక్రమ కట్టడాలను నిర్మించుకుని అక్కడే బతులులీడుస్తున్న వారు ఇవేం వానలని హడలి చస్తున్నారు. మొత్తం హైదరాబాద్ కోటికి పైగా జనాభా. ఎందరినో పోషిస్తున్న ఈ మహనగరం వాన నీటిని మాత్రం చోటు లేదని చెప్పేస్తోంది. పై నుంచి కుండపోతలా ఒక అరగంట పాటు వాన పడితే చాలు ఆ నీరు ఎక్కడికి పోవాలో తెలియదు. దాంతో అదే జల విలయం గా మారుతోంది.

ఇవన్నీ ఇలా ఉంటే హైదరాబాద్ వాసులకు మరో చేదు వార్త కూడా పర్యావరణవేత్తలు చెబుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న రోజుల్లో ఏకంగా యాభై సెంటీమీటర్ల వాన ఒకేసారి అలా వదలకుండా కురిసే అవకాశాలు కూడా ఉంటాయట. అపుడు ఈ నగరం పరిస్థితి ఏంటి. అందుకే ఇప్పటినుంచే తర తమ భేదాలు లేకుండా ఆక్రమణలన్నీ  చక్కదిద్దాలి. లేకపోతే నగరాన్ని వరుణుడు  వణికించేయడం ఖాయం అంటున్నారు  ప్రకృతి ప్రేమికులు.

మరింత సమాచారం తెలుసుకోండి: