అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కరోనా నుంచి కోలుకున్నాక కస్సుమంటున్నారు. తనకు ఇపుడు ఎంతో శక్తివచ్చిందని చెప్పుకుంటున్న ఈ శ్వేతసౌధం పెద్దన్న నోరు ధాటీగా పనిచేస్తోందని చెప్పకేనే చెబుతున్నాడు. తాను ఎట్టి పరిస్థితుల్లో గెలిచి తీరుతాను అన్న ధీమా ఒక్కసారిగా  సడలిపోయింది. మరో ఇరవై రోజుల్లో అమెరికా అధ్యక్ష  ఎన్నికలు. దాంతో ఓటమి భయంతో ట్రంప్ ఏమి మాట్లాడుతున్నాడో కూడా ఎవరికీ అర్ధం కావడం లేదుట. తన ప్రత్యర్ధి జో బైడెన్ చేతిలో ఓడిపోయి అమెరికాలో ఉండడం కంటే వేరే దేశం వెళ్ళిపోతాను అని ట్రంప్ అంటున్నాడు.

ఇది ఒక విధంగా ఆయన నైరాశ్యాన్ని తెలియచేస్తోంది. అదే సమయంలో ఆయనలోని పరాజయ భావానికీ అద్దం పడుతోంది. తన ప్రత్యర్ధిని ఇప్పటికీ చులకంగా చూడడమే ట్రంప్ చేస్తున్న అతి పెద్ద తప్పు. ప్రజాస్వామ్యంలో ప్రతీ ఒక్కరూ సమానమే. ఎవరిని జనం జై కొట్టి గెలిపిస్తే వారే ప్రభువులు అవుతారు. నాలుగేళ్ళ క్రితం ట్రంప్  కూడా ఒక సామాన్యుడే అన్న సంగతి మరచారు. తాను పుట్టిన దగ్గర నుంచి కూడా అమెరికా దేశానికి అధినేతను అని భావిస్తున్నట్లున్నారు.

అయితే జనాల ముందు ఎవరి పప్పులూ ఉడకవు.  ఎవరూ శాశ్వతంగా పాలించేందుకు పుట్టలేదు. జనానికి నచ్చిన వారే పదవిలో ఉంటారు. ఇపుడు జో బైడెన్ వంతు వచ్చింది. ఆయనకు అమెరికన్లు పట్టం కట్టేలా ఉన్నారు.  దీంతో ఇదంతా చూస్తున్న ట్రంప్ కి మంట రేగుతోంది. ఆయన ఆ ఆవేశంలో ఏదేదో అంటున్నాడు. చైనా, రష్యా, భారత్ లను ఒకే గాటకు కట్టి మరీ విమర్శిస్తున్నాడు. మోడీ నా ప్రాణ స్నేహితుడు అంటూ మాట్లాడిన నోటితోనే ఇపుడు వెక్కిరిస్తున్నాడు. నిజంగా ఈ ఒక్కటి చాలాదా ట్రంప్ లో ఎన్ని కళలు, రూపాలు ఉన్నాయో చెప్పడానికి అందుకే అమెరికన్ ఓటర్ తెలివైన నిర్ణయమే తీసుకునేలా ఉన్నాడు. అదే జరిగితే ట్రంప్ అమెరికాలో ఉండరట. తాను ఓడితే వేరే దేశం పోతాను అంటున్నాడు. మరి అందరితోనూ తంపులు పెట్టుకున్న ట్రంప్ ఏ దేశంలో ఉంటాడబ్బా.


మరింత సమాచారం తెలుసుకోండి: