అమెరికా ఎన్నికల ప్రచారం హీటెక్కుతోంది.  అభ్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు.  ట్రంప్‌ ప్రజల్ని చీలుస్తున్నారని బైడెన్‌ అంటే... అతడో అవినీతిపరుడని విరుచుకుపడ్డారు అమెరికన్‌ ప్రెసిడెంట్‌.

అత్యంత ప్రజాదరణ కలిగిన అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్‌ ఒబామా అధ్యక్ష ఎన్నికల ప్రచార పర్వంలోకి దిగనున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌, ఉపాధ్యక్ష అభ్యర్థి కమలా హారీస్‌కు మద్దతుగా ఒబామా ప్రచారం చేయనున్నారు. దీనిపై ఆ పార్టీ ప్రచార కమిటీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అక్టోబర్‌ 21న ఫిలడేల్ఫియా, పెన్సిల్వేనియాలో జరిగే ప్రచారం కార్యక్రమాల్లో ఆయన పాల్గొననున్నారు.

ప్రత్యక్ష రాజకీయాలకు దూరమై నాలుగేళ్లు గడుస్తున్నా.. ఒబామాకు ప్రజల్లో ఎంతో ఆదరణ ఉంది. అందుకే ట్రంప్‌నకు ధీటుగా ఆయనను ప్రచారంలోకి దింపాలని పార్టీ భావించింది. మరోవైపు ఒబామా ప్రచారంపై ట్రంప్‌ విమర్శలు చేశారు. ప్రజలపై ఆయన అంతగా ప్రభావం చూపలేరని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీదే విక్టరీ అని విశ్వాసం వ్యక్తం చేశారు.

ఓటింగ్‌ దగ్గరపడుతున్న కొద్దీ ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోంది. ఇరు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ట్రంప్‌ ప్రజల్లో విభజన తెచ్చేందుకు ఎంతదూరమైనా వెళతారని బిడెన్‌ ఆరోపించారు. విద్వేషాలు రెచ్చగొట్టి సంతోషిస్తారని విమర్శించారు. అటు ట్రంప్‌ సైతం బైడెన్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బైడెన్‌ అవినీతిపరుడని ఆరోపించారు. రాజకీయాలకు పనికిరాడంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు ట్రంప్‌.

మరోవైపు ఇప్పటి వరకు జరిపిన పలు సర్వేల్లో ట్రంప్‌ కంటే బైడెన్‌ రేసులో ముందున్నారు. టీవీ చర్చా కార్యక్రమాల్లోనూ బైడెనే దూసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధ్యక్ష పదవికి పోటీ చేసే ఇరు అభ్యర్థులు మాటల తూటాలు పేల్చుతున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. అంతేకాదు ఓటర్లను ఆకట్టుకునేందుకు శతవిథాలా ప్రయత్నం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: