గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు హైదరాబాదులో పెడుతున్న భారీ వర్షాలు అక్కడి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. అంతేకాకుండా రాజకీయ పార్టీలకు కూడా వర్షాలు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పుడు అధికార టిఆర్ఎస్ పార్టీ ఈ వర్షాల నుంచి తమకు ఎక్కడ రాజకీయ ఇబ్బందులు వస్తాయో అని కంగారు పడే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి హైదరాబాద్ లో ఎక్కడో ఒకచోట లోతట్టు ప్రాంతాల్లో వరదలు సర్వసాధారణం. కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్ వ్యాప్తంగా ఈ విధంగా వరదలు రావడంతో అసలు పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది.

జిహెచ్ఎంసి అధికారులు కూడా హైదరాబాదులో జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. అయితే చెరువులను కబ్జా చేసి నివాసాలు కట్టడంతో పరిస్థితి చాలా దారుణంగా మారింది అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కెసిఆర్ త్వరలోనే వరద బాధిత ప్రాంతాల్లో కూడా పర్యటించి అక్కడి ప్రజలకు భరోసా ఇవ్వాలని భావిస్తున్నారు. మంత్రి కేటీఆర్ కూడా ఇప్పుడు ప్రజల్లోనే ఎక్కువగా తిరుగుతున్నారు. అయితే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో మాత్రం ఈ వర్షాలు టిఆర్ఎస్ పార్టీ విజయావకాశాలను కచ్చితంగా దెబ్బ కొట్టడం ఖాయమని అభిప్రాయపడుతున్నారు.

గత జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ ఎన్నో హామీలు ఇచ్చింది. హైదరాబాద్ విషయంలో సీఎం కేసీఆర్ కూడా ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టారు. కానీ పరిస్థితి మాత్రం ఇంకా హైదరాబాద్ లో మెరుగుపడలేదు. దీనితో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ హామీలు ఇచ్చినా సరే ప్రజలు నమ్మే పరిస్థితి లేకపోవచ్చు అనే భావన వ్యక్తమవుతోంది. ఇక కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇప్పుడు వర్షాల దెబ్బకు బయటకు రాకపోవడంతో టిఆర్ఎస్ పార్టీకి ప్రచారం చేయడానికి కూడా నేతల కొరత ఉన్న పరిస్థితి ఉంది. నవంబర్ లేదా డిసెంబర్లో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఈ వర్షాల దెబ్బ నుంచి ఎలా బయటకు రావాలి అని పార్టీ అధిష్టానం వ్యూహాలు సిద్ధం చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: