ఉండవల్లి అరుణ్ కుమార్. రెండు సార్లు ఎంపీగా పనిచేసిన సీనియర్ మోస్ట్ నేత. ఒక విధంగా చెప్పాలంటే రాజ‌కీయ మేధావి అనాలి. వైఎస్సార్ కోటరీలో అతి ముఖ్యుడు. స్వతహాగా న్యాయవాది. ఆయన లాజిక్ గా మాట్లాడుతారు. పాయింట్ టు పాయింట్ చక్కగా  వివరిస్తారు. ఆయన మాటలకు జవాబు చెప్పే సాహసం తెలుగునాట ఎవరూ చేయలేరు అని కూడా అంటారు. తాను చెప్పదలచుకున్న విషయం మీద పూర్తి పట్టు సాధించి కానీ ఆయన మీడియా ముందుకు రారు.

ఇక వైఎస్సార్ వారసుడు జగన్ ఏపీ సీఎంగా ఉన్నారు. ఏడాదిన్నరగా పాలన చేస్తున్నారు. జగన్ చేసిన మంచి పనులు ఓ వైపు ఉన్నాయి. అలాగే వివాదాలూ మరో వైపు ఉన్నాయి. ఏమైనా కూడా మా స్నేహితుడు కుమారుడు జగన్ సీఎం అయితే నా కంటే సంతోషించేవారు ఎవరూ ఉండరు అని ఉండవల్లి ఆనాడు అనేవారు, ఇక జగన్ సీఎం అయ్యాక కొత్తల్లో ఆయన బాగా పొగిడారు కూడా. కానీ కొంతకాలంగా ఆయన జగన్ మీద బాణాలను ఎక్కుపెడుతున్నారు. ఆయన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను కూడా విమర్శిస్తున్నారు.

కరోనా బారిన పడి కోలుకున్న తరువాత ఉండవల్లి తాజాగా మీడియా ముందుకు వచ్చారు. ఆయన రాష్ట్రంలో ఏర్పడిన అసాధారణమైన పరిస్థితుల మీద తనదైన హాట్ హాట్ కామెంట్స్ చేశారు. పంచ్ డైలాగ్స్ కూడా విసిరారు. ఈ కామెంట్స్ ఎక్కువగా జగన్ కే తగలడం విశేషం. జగన్ మొండితనంతో దూకుడుగా పోతారని ఉండవల్లి అన్నారు. సీజేఐకి లేఖ రాయడం తప్పు కాదంటూనే గతంలో ఉమ్మడి ఏపీ సీఎం దామోదరం సంజీవయ్య లేఖ రాసిన తరువాత ఏకంగా సీఎం పదవి నుంచి తప్పించిన సంగతిని గుర్తు చేశారు.

అలాగే జగన్ విషయంలో కూడా కోర్టులను తప్పుపట్టేకంటే తన పాలనలో లోపాలు ఎక్కడ ఉన్నాయో చూసుకోవాలని కూడా సూచించారు. న్యాయ వ్వవస్థ, శాసన వ్యవస్థల మధ్యన ఘర్షణ వల్ల జనం నష్టపోతారని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. జగన్ కేసుల మీద కూడా కామెంట్స్ చేశారు జరీమానాతో విడిచిపెట్టే కేసులే ఇవన్నీ అంటూ ఓదార్పు మాటలు మాట్లాడారు. మరో వైపు జస్టిస్ ఎన్వీ రమణ మీద ప్రభుత్వం చేసిన కామెంట్స్ ని తాను నమ్మలేనంటూ బాంబు కూడా వేశారు. రాజ్యాంగపరంగా నిర్ణయాలు ఉంటే ఏ కోర్టూ కొట్టేసే సాహసం చేయదని కూడా చెప్పుకొచ్చారు. ఇవన్నీ చూసినపుడు జగన్ కి అనుకూలంగా మాట్లాడారా, వ్యతిరేకించారా అన్నది అర్ధం కాక వైసీపీ నేతలే బుర్రలు గోక్కుంటున్నారుట. మొత్తానికి జగన్ కి ఉండవల్లికి మధ్య దూరం అలాగే ఉందని అన్న వారే ఎక్కువగా కనిపిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: