వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తున్న "బీసీల కోసం జగనన్న మోసం" కార్యక్రమం పనితీరు బాగుంది అని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. 16 నెలల వైసీపీ పాలనలో బీసీ లను మోసం చేయడం తప్ప మరేం చేశారో వైసీపీ నేతలు చెప్పాలి? అని ఆయన నిలదీశారు. వైసీపీ ప్రభుత్వం  వెనుకబడిన కులాల వెన్నెముక విరుస్తోంది అని అన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే  బీసీలకు ఎవరు ఏం చేశారో  రాష్ట్రంలో ని ఏ గ్రామంలోని బీసీ కాలనీ లో నైనా సరే బహిరంగ చర్చకు రావాలి అని ఆయన డిమాండ్ చేసారు.

బీసీల సంక్షేమానికి 2020–21 బడ్జెట్‌లో కాంపోనెంట్‌ ద్వారా రూ.25,331.30 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించి.. ఆ సొమ్ములో దాదాపు 95శాతం నిధుల్ని నవరత్నాల కోసం మళ్లించనున్నట్లు ప్రకటించారన్నారు. 2018-19లో బీసీ సబ్ ప్లాన్ కు తెలుగుదేశం ప్రభుత్వం రూ.16,226 కోట్లు కేటాయిస్తే.. జగన్మోహన్ రెడ్డి రూ.15,061 కోట్లు మాత్రమే కేటాయించి అందులోనూ రూ.4వేల కోట్లు ఇతర పథకాలకు మళ్లించారని ఆయన విమర్శించారు. కార్పొరేషన్లు పేరుతో వైసీపీలోని రాజకీయ నిరుధ్యోగులకు కొంత మందికి ఛైర్మన్లు, డైరెక్టర్లుగా అవకాశాలు కల్పించి.. కార్పొరేషన్ల ద్వారా లబ్ది పొందే లక్షలాది మంది యువత ద్రోహం చేస్తున్నారన్నారు.

టీడీపీ ప్రభుత్వం ప్రతి ఏటా బీసీ కార్పొరేషన్ నుండి దాదాపు రూ.3వేల కోట్లు స్వయం ఉపాధి రుణాల కోసం వెచ్చించిందని చెప్పారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నాడు మంజూరు చేసిన యూనిట్లను రద్దు చేయడమే కాక.. ఇప్పటి వరకు కొత్తగా  ఒక్క కొత్త రుణం యూనిట్ మంజూరు చేయలేదన్నారు. 16 నెలల్లో రూ.33వేల కోట్లు ఖర్చు చేశామంటూ పత్రికల్లో ప్రకటనలు వేసుకుంటున్న జగన్ రెడ్డి.. ఆ సొమ్ముతో ఎంత మంది బీసీలకు మేలు చేశారు.? అని ఆయన ప్రశ్నించారు. కొత్తగా ప్రవేశపెట్టిన పథకం గానీ.. అందించిన సంక్షేమంగానీ ఏమీ లేకున్నా రూ.33వేల కోట్లు అంటూ ప్రకటించుకుంటూ రాష్ట్రంలోని బీసీలను వంచిస్తున్నారని విమర్శించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: