అమరావతి: ట్రాఫిక్ కష్టాలతో నరకం చూస్తున్న బెజవాడ వాసులుకు ట్రాఫిక్ కష్టాల నుండి కొంతమేర ఉపశమనం లభించింది. చాలా కాలంగా ఎదురు చూస్తోన్న కనకదుర్గ ప్లైఓవర్ తాజాగా ప్రారంభమైంది. పలుమార్లు వాయిదా పడుతూ వచ్చిన విజయవాడ దుర్గ గుడి ఫ్లైఓవర్ ను ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ లు ప్రారంభించారు. వర్చువల్ విధానంలో ఈ ప్రారంభోత్సవం నిర్వహించారు. దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, వీకే సింగ్, ఏపీ మంత్రి శంకర్ నారాయణ, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్ర కుమార్, సీఎం రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కనకదుర్గ ఫ్లైఓవర్ కల సాకారమైందని, ఇది రాష్ట్ర ప్రగతిని మార్చే ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు. విజయవాడ నగరంలో ట్రాఫిక్ కష్టాలు ఈ ఫ్లై ఓవర్ వినియోగంలోకి రావడంతో తొలగుతాయని చెప్పిన ఆయన ఏపీ అభివృద్ధికి మోడీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఫ్లైఓవర్ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసినందుకు వైసీపీ ప్రభుత్వంపై ఆయన ప్రశంసలు కురిపించారు.

కాగా.. ఈ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఎప్పుడో పూర్తికాగా పలుమార్లు ప్రారంభోత్సవానికి ముహూర్తం పెట్టి వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఇక ఇంతకుముందు కూడా కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కరోనా పాజిటివ్ రావడంతో ఫ్లైఓవర్ ప్రారంభోత్సవం వాయిదా పడింది. కనకదుర్గ ఫ్లై ఓవర్ ను ప్రారంభించడంతో పాటు గా సీఎం జగన్ మోహన్ రెడ్డి తో కలిసి 7584 వేల కోట్ల రూపాయల విలువైన మరో 16 ప్రాజెక్టులకు భూమి పూజ నిర్వహించారు. మొత్తం 15,592 కోట్ల రూపాయల పనులకు భూమి పూజలు నిర్వహించారు మంత్రి నితిన్ గడ్కరీ. 9 జాతీయ రహదారులు ప్రాజెక్టులను జాతికి అంకితం ఇచ్చారు. ప్రస్తుతం 502 కోట్ల రూపాయలతో 6 వరుసలతో 2.6 కిలోమీటర్ల మేర నిర్మించిన ఫ్లైఓవర్ ప్రారంభించిన నితిన్ గడ్కరీ, వైయస్ జగన్మోహన్ రెడ్డి ఫ్లైఓవర్ ను జాతికి అంకితం చేశారు . మొత్తం 900 రోజుల్లో ఈ ఫ్లైఓవర్ పూర్తి అయినట్లుగా తెలుస్తుంది. దుర్గగుడి ఫ్లై ఓవర్ ప్రారంభంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని ఊపిరి పీల్చుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: