తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూరికార్డులకు సంబంధించిన ప్రత్యేక వెబ్‏సైట్ "ధరణి" దసరా నుంచి ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూరికార్డుల నమోదు కార్యక్రమం వేగంగా సాగుతుండగా, దీనికి సంబంధించిన 'ధరణి' వెబ్‏సైట్‏ను తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 25న ప్రారంభించనున్నారు. కొత్త చట్టంతో వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి, భూ రికార్డులను ప్రజలకు సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటుంది. ధరణి వెబ్‏సైట్‏కు సంబంధించిన అన్ని పనులను పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ధరణి వెబ్‏సైట్‏లో ఏ సమాచారం అయితే ఉంటుందే దాని ఆధారంగానే రిజిస్ట్రేషన్లు చేయాలని, మరేవిధమైన రికార్డులను పరిశీలించకూడదని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది.

వెబ్‏సైట్ ప్రారంభమైన రోజునే హైదరాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా 570 మండలాల్లోని వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. అయితే తొలిదశలో రిజిస్ట్రేషన్లకు సంబంధించి నాలుగు డాక్యుమెంట్లను మాత్రమే చేయడానికి తహసీల్దార్లకు అవకాశం ఇచ్చారు. ఇందుకోసం భూముల విక్రయాలకు సంబంధించిన సేల్ డీడ్, కుటుంబ సభ్యులు / ఇతర భూముల యాజమానులు పంచుకునే పార్టిషన్, కుటుంబసభ్యులు సమర్పించే సక్సెషన్ (వారసత్వ) డీడ్, గిఫ్ట్ డీడ్‏లు చేయడానికే తహసీల్దార్లకు అవకాశం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. శనివారం ధరణి (వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్) పై తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, రెవెన్యూ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు అనుమానాలు వ్యక్తం చేయగా, కొన్సింటికి యంత్రాంగం జవాబు ఇచ్చింది.

శనివారం ధరణి పోర్టల్ సన్నద్ధతపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సోమేశ్ కుమార్ ధరణి పోర్టల్ దేశంలోనే విప్లవాత్మకంగా నిలుస్తుందని అన్నారు. ధరణి సేవలకు అంతరాయం కలుగకుండా చూసేందుకు డిస్కమ్, బ్రాడ్‏బ్యాండ్ సర్వీస్ ప్రొవైడర్లు, TSTS ప్రతినిధులతో క్రమం తప్పకుండా సమన్వయ సమావేశాలు నిర్వహించాలి సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: