మనం చూస్తూ వున్నాం. మహిళలపైన అరాచకాలు రోజురోజుకీ ఎక్కువైపోతున్నాయి. హత్యలు, మానభంగాలు ఒకవైపు జరుగుతుంటే, మరో వైపు అమ్మాయిల మిస్సింగ్ కేసులు ఎక్కువగా నమోదు అయ్యి, కలకలం సృష్టిస్తున్నాయి. దేశంలో విమెన్ ట్రాఫికింగ్ మితిమీరిపోతోంది. అయితే ఇలాంటి విషయాల దృష్ట్యా.. అంతర్జాతీయ మహిళల అక్రమ రవాణ కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక ముందడుగు వేసింది.

ఓ కేసుకు సంబంధించి ఎన్‌ఐఏ తాజాగా ప్రత్యేక న్యాయ స్థానంలో అభియోగ పత్రాలను దాఖలు చేసింది. ఇటీవల బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్‌ తరలిస్తున్న యువతులను పట్టుకున్న సంగతి అందరికీ తెలిసినదే. అంతే కాకుండా వీరు ఇక్కడి నుండి వివిధ ప్రాంతాలకు సదరు యువతులను అక్రమంగా తరలిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలో పోలీసులు మాటువేసి సదరు ముఠాను పట్టుకున్నారు. ఈ కేసులో భాగంగా ఇప్పటి వరకు 12 మంది అమ్మాయిలను వారు పట్టుకున్నట్టు తెలుస్తోంది.

కాగా... వీరిలో దాదాపు తొమ్మిది మంది అమ్మాయిలు బంగ్లాదేశీయులు కావడం కొసమెరుపు. ఇక మిగతా వారు మాత్రం స్థానికులే అని ఎన్‌ఐఏ గుర్తించింది. సదరు ముఠా వారికోసం నకిలీ ఇండియన్‌ ఐడీ కార్డు సృష్టించి, బంగ్లాదేశ్‌ నుంచి వారిని అక్రమంగా తరలించి.. గృహాల్లో నిర్బంధించి బలవంతంగా వ్యభిచారం చేయిస్తున్నారు. సదరు ముఠాపై తాజాగా ఎన్‌ఐఏ చార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. వారిని ఉద్యోగాల పేరుతో హైదరాబాద్ తరలించి వ్యభిచార గృహాలకు తరలిస్తున్నట్లు పేర్కొంది.

వారిని సినిమాటిక్ గా తరలిస్తున్న తీరు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. వారిని సోన్‌ నది తీరాన్ని దాటించి కలకత్తా మీదుగా ముంబాయి, తరువాత హైదరాబాద్ తరలించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. మొదట నగరంలోని పహడీషరీఫ్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మహిళల అక్రమ రవాణాపై కేసు నమోదు కావడం ఈ తంతుకి ఓ కూపీ దొరికింది. ఆ తరువాత ఎన్‌ఐఏ దీన్ని ఛాలెంజింగ్ గా తీసుకొని జల్పల్లి ప్రాంతంలో సోదాలు జరిపారు. అక్కడ వున్న కొన్ని వ్యభిచార గృహాల్లో నలుగురు బంగ్లా యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నాక అసలు విషయం బయటపడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: