అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు దగ్గరవుతున్న కొలదీ ఎన్నికల వేడి మరింతగా రాజుకుంటోంది. ఈ శుక్రవారం ఫ్లోరిడా, జార్జియా ఎన్నికల ర్యాలీలలో మాట్లాడిన ట్రంప్‌ తన ప్రచార తీవ్రతను పెంచారు. ఈ సందర్భంగా తన డొమెక్రాటిక్ ప్రత్యర్థి జో బిడెన్‌పై చాలా తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ క్రమంలో ట్రంప్.. ఎన్నికల్లో ఒకవేళ తాను ఓడిపోతే మాత్రం దేశాన్ని విడిచి పోవాల్సి వస్తుందేమోనని సందేహం వ్యక్తం చేసారు.

ఇక బిడెన్ గురించి మాట్లాడుతూ.. ఆయన గెలిస్తే మాత్రం కమ్యూనిజం, క్రిమినల్ వలసదారుల "వరద" దేశంలోకి ప్రవహిస్తుందని బల్ల గుద్ది మరీ చెప్పారు. 'అధ్యక్ష రాజకీయాల చరిత్రలో ఓ చెత్త అభ్యర్థిపై పోటీ చేయడం నాపై నాకే అసహ్యం వేస్తోంది." అని అన్నారు. ప్రజలను ఉద్దేశించి, 'నేను ఓడిపోవడాన్ని మీరు సహించగలరా? నేను ఏం చేయాలి?' అని ట్రంప్‌ ప్రశ్నించారు. దానికి అక్కడ స్థానికంగా వున్న ప్రజలు ఒక్కసారిగా 'మీరే గెలుస్తారు' అనే నినాదాలు చేసారు.

దాంతో ట్రంప్ మరలా.. వారిని అడుగుతూ.. 'ఒకవేళ నేను గెలవకపోతే ఏంటి పరిస్థితి?" అని అడుగగా వారు ఒక్కసారిగా నిశ్శబ్దంగా వున్నారు. దానికి ట్రంప్ స్పందిస్తూ... 'నేను గాని ఓడిపోతే మాత్రం బహుశా నేను దేశం విడిచి వెళ్ళవలసి వస్తుందేమో!' అని వ్యాఖ్యానించారు. ఒకవైపు అమెరికా అధ్యక్ష ఎన్నికల గడువు సమీపిస్తుండటం రిపబ్లిక్‌ పార్టీకి కంచు కోటలైన ఫ్లోరిడా, జార్జియాలో తన మద్దతుదారులను కూడగట్టడంపై ట్రంప్‌ దృష్టి కేంద్రీకరించారు.

ఇకపోతే ఈ పర్యటనలలో భాగంగా ట్రంప్ భారత్ పై నోరు పారేసుకున్నారు.. చైనా రష్యాలతో కలిసి భారత్ ప్రపంచ పర్యావరణానికి విఘాతం కలిగిస్తుందని ఆరోపించారు.  అధ్యక్షుడిగా తను ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశానని గప్పాలు కొట్టారు. అమెరికా ఇంధన స్వయం సమృద్ధిని సాధించిందంటే అది కేవలం తన ఘనతేనని చెప్పుకుంటూ వచ్చారు. అమెరికా పర్యావరణం, ఓజోన్ క్షేమంగా ఉన్నాయని, ఇండియా, చైనా, రష్యా వంటి దేశాలే వాయు కాలుష్యాన్ని పెంచుకుంటూ పోతున్నాయని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: