కేంద్ర హోంమంత్రి అమిత్‌షా కు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారు. భారీ వర్షాలు, వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని కోరారు. ప్రాథమిక అంచనా  ప్రకారం 4వేల 450 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని, తక్షణ సాయంగా 1000 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

భారీ వర్షంతో అతలాకుతలమైన ఆంధ్రప్రదేస్ ను ఆదుకోవాలని.. కేంద్రాన్ని కోరారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌. కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు లేఖ రాసిన జగన్‌... రాష్ట్రానికి ఆర్థికసాయం  చేయాలని కోరారు. తక్షణ సాయంగా వెయ్యికోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరిన ముఖ్యమంత్రి... జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని ఏపీకి  పంపాలని లేఖలో విజ్ఞప్తి చేశారు.

ఇప్పటికే కరోనా కారణంగా ఆర్థికంగా దెబ్బతిన్న రాష్ట్రాన్ని వరదలు ముందచెత్తడంతో తీవ్రంగా నష్టపోయామని అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు సీఎం జగన్‌. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం కారణంగా రాష్ట్రంలో ఈనెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయనీ.. అత్యధికశాతం వర్షాపాతం నమోదైందని చెప్పారు.

ఎగువ రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి భారీగా వరద పొటెత్తిందని..  దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీతో సహా, పలు చోట్ల గత మూడు రోజులుగా  తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేసి, లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించామనీ.. హోంమంత్రికి రాసిన లేఖలో తెలిపారు సీఎం జగన్‌. భారీ వర్షాలు,  వరదలతో జన జీవితం అస్తవ్యస్తమైందన్న జగన్‌.. ఆగస్టు, సెప్టెంబరులోనూ భారీ వర్షాలకు ఇప్పటి వరదలతో నష్టం మరింత పెరిగిందన్నారు.

వరసగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో రహదారులను తీవ్రంగా దెబ్బతీశాయన్నారు. విద్యుత్‌ ఉత్పత్తిపైనా వర్షాలు ప్రభావం చూపాయని సీఎం జగన్ వివరించారు. ఈ వర్షాల  వల్ల రైతులు చాలా నష్టపోయారనీ.. చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు తీవ్రంగా దెబ్బ తిన్నాయని జగన్‌ వివరించారు. ప్రాథమిక అంచనాల  ప్రకారం దాదాపు 4వేల 450 కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగిందనీ.. తక్షణ సాయంగా వెయ్యికోట్ల రూపాయలు విడుదల చేయాలని కోరారు.



మరింత సమాచారం తెలుసుకోండి: