అమెరికాలో ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఇటీవలే కరోనా వైరస్ నుంచి కోలుకున్న డొనాల్డ్ ట్రంప్, ప్రచారంలో దూసుకుపోతున్నారు. తనదైన పదునైన వ్యాఖ్యలతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తాజా ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీయే విజయం సాధిస్తుందని ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగానే రిపబ్లికన్‌ పార్టీనే గెలిపించాలని ప్రజలను కోరారు. డెమొక్రాటిక్ అభ్యర్థి జో బిడెన్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మెజార్టీ సర్వేలు పేర్కొంటున్న వేళ.. ట్రంప్ మరింత రెచ్చిపోయారు. బిడెన్ గెలిస్తే తాను అమెరికాను విడిచి వెళ్లిపోతానని సవాల్ విసిరారు.

ఒక సభలో ‘నా ఓటమిని మీరు ఊహించగలరా? ఒకవేళ అదే జరిగితే.. నేను ఎప్పటిలా ఉండలేను. అమెరికాను విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్లిపోవచ్చేమో. నాకు తెలియదు..’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. శుక్రవారం (అక్టోబర్ 16) సాయంత్రం జార్జియాలోని మాకన్‌లో ఎన్నికల ర్యాలీలో ప్రసంగిస్తూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. శనివారం మిచిగాన్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్.. తన విమర్శలకు మరింత పదునుపెట్టారు. ప్రస్తుత ఎన్నికల గురించి ఆలోచించాల్సిన అవసరమే తనకు లేదన్నారు. ఈ ఎన్నికల్లో విజయం తమదేనని బలంగా నమ్ముతున్నట్లు చెప్పారు. ‘మరో నాలుగేళ్లు రిపబ్లికన్‌ పార్టీ అధికారంలో ఉండటం ఖాయం’ అని ట్రంప్ అన్నారు. ప్రజలంతా రిపబ్లికన్‌ పార్టీకి విజయం అందించాలి అని కోరారు. దీంతో సభకు వచ్చిన వీక్షకులు ‘మరో నాలుగేళ్లు.. మరో నాలుగేళ్లు’ అంటూ పెద్ద పెట్టున నినాదాలు చేశారు.

‘తాజా ఎన్నికలు అమెరికా చరిత్రలోనే అంత్యంత కీలకమైనవి. అమెరికా ప్రజలకు అధికారాలిచ్చే దిశగా పని చేస్తున్నాం. అమెరికా ప్రజల అండదండలతో ఇప్పటి వరకు పాలన సజావుగా సాగింది. రిపబ్లికన్‌ పార్టీకి మరోసారి అధికారమిచ్చి మున్ముందు కూడా దేశానికి మరింత సేవ చేసుకునే అవకాశం కల్పించండి’ అని ఓటర్లను డొనాల్డ్ ట్రంప్‌ కోరారు.అమెరికా అధ్యక్ష ఎన్నికలకు దగ్గర పడుతున్నకొద్దీ రిపబ్లిక్‌, ప్రతిపక్ష డెమోక్రాటిక్‌ పార్టీల అభ్యర్థులు విమర్శలకు పదునుపెట్టారు. దీంతో అక్కడ వాతావరణం వేడెక్కింది. అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 3న జరగనున్నాయి. ట్రంప్‌కు కరోనా సోకడంతో డొనాల్డ్‌ ట్రంప్‌, బిడెన్‌ మధ్య అక్టోబర్‌ 15న జరగాల్సిన రెండో ముఖాముఖి రద్దయిన నేపథ్యంలో వచ్చే వారంలో బెల్మాంట్ యూనివర్సిటీలో ఈ ఇద్దరు నేతలు ముఖాముఖి భేటీ కావొచ్చని భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: