కుండపోతగా కురుస్తున్న వర్షాలకు ఆంధ్రప్రదేశ్‌లో వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. చేతికి అందిన పంటలు నీట మునగటంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వివిధ జిల్లాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. కృష్ణా జిల్లాలోఇప్పటి వరకు 22 వేల హెక్టార్లలో పంట పొలాలు నీట మునిగినట్టు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. జగ్గయ్యపేట నుంచి అవనిగడ్డ వరకు 15 మండలాల్లోని పంట పొలాలు కృష్ణమ్మ వరద ఉద్ధృతికి కొట్టుకుపోయాయి. ప్రధాన పంటలతో పాటు వాణిజ్య పంటలు, పండ్ల తోటలు కూడా వరద నీటిలో మునిగిపోయాయి.

అయితే... కృష్ణా నది తాత్కాలికంగా వరద తగ్గినప్పటికి మళ్ళీ ఆరు లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉందని గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ తెలిపారు. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారని చెప్పారు. ఎవరూ నదీ ప్రవహంలోకి వెళ్లొద్దని హెచ్చరించారు. తెనాలి డివిజన్ పరిధిలో కొల్లిపర, కొల్లూరు, భట్టిప్రోలు, రేపల్లె మండలాల పరిధిలో ప్రాథమికంగా 10 వేల ఎకరాల్లో పంట నష్టపోయినట్లు గుంటూరు కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్ ప్రకటించారు.

పశ్చిమ గోదావరి జిల్లాలో 70 వేల 500 ఎకరాలు నీట మునిగాయి. 437 గ్రామాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఎడతెరపి లేని వర్షాలకు వరి పంటతో పాటు వేరుశనగ, పత్తి, మొక్కజొన్న పంటలు పూర్తిగా నీటమునిగిపోయాయి.

తూర్పుగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆత్రేయపురం మండలంలో కంద, పసుపు, అరటి పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు రైతులు. ముంపు సమస్యలను ఎమ్మెల్యే జగ్గిరెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. ఉచ్చిలి సమీపంలో ఆర్అండ్‌బి రోడ్డుకు గండికొట్టి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించారు.

మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వేలాది హెక్టార్లలో రైతులకు పంట నష్టం జరిగింది. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు కోరుకుంటున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: