తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగిపోయాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు రైతులు.

ఖమ్మం జిల్లాలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాలకు వరి, పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. ఖమ్మం జిల్లాలో 75 వేల 364 ఎకరాలు, భద్రాద్రి జిల్లాలో 8 వేల 313 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. 53 వేల 358 మంది రైతులు నష్టపోయారని ప్రాథమిక అంచనా వేశారు అధికారులు. కొన్నిచోట్ల పొలాల్లో ఇసుక మేటలు వేశాయి. పత్తి కాయలు వర్షానికి చెట్టుపైనే నల్లబడి నీరుకారిపోతున్నాయి. కాయలు కుళ్లిపోయి పురుగులు పడుతున్నాయి. మిర్చితోటలు, కూరగాయల పంటలు వర్షాలకు తీవ్రంగా దెబ్బతిన్నాయి.

నిజామాబాద్ జిల్లాలో వర్షాలు రైతులను నిండాముంచాయి. 30 వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ఎక్కువగా వరి పంట దెబ్బతింది. అమ్మకానికి సిద్దంగా ఉంచిన దాన్యం తడిసి ముద్దయింది. తడిసిన ధాన్యం ప్రభుత్వమే కోనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. రోడ్లపైనే ఆందోళనలు చేస్తున్నారు. ధాన్యం కోనుగోళ్లు ఆలస్యమవడం వల్లే తాము నష్టపోవాల్సి వచ్చిందని చెబుతున్నారు రైతులు.

భారీ వర్షాలకు నారాయణపేట జిల్లాలో వేలాది ఎకరాల్లో పత్తి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నారు పత్తి రైతులు. మొత్తానికి తెలంగాణలో వానలు దంచి కొడుతున్నాయి. ఎప్పుడు వానలు పడతాయో.. ఎపుడు ఎండలు కాస్తాయో అర్థం కావడం లేదు. ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతం కావడం.. వెంటనే వర్షాలు పడటం సర్వసాధారణమైపోయింది.

ఏక ధాటిగా కురుస్తున్న వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే పలు చోట్ల ఇళ్లు నీటమునిగాయి. అంతేకాదు పలు వాహనాలు సైతం బురదలో కూరుకుపోయాయి.

అంతేకాదు పలు వాహనాలు సైతం బురదలో కూరుకుపోయాయి. తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షాలకు పంట నీటమునిగింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.








మరింత సమాచారం తెలుసుకోండి: