తెలుగుదేశం పార్టీ ఆషామాషీ పార్టీ కాదు. ఇవాళ పుట్టినది అంతకంటే కాదు. ఈ దేశంలో కాంగ్రెస్ పని ఖతం అని అనుకున్న ప్రతీసారీ ఆ పార్టీ లేచి నిలబడింది. వీర విహారమే చేసింది. అలాంటి సెంటిమెంట్ ఉన్న పార్టీగా టీడీపీని కూడా తెలుగు రాజకీయాల్లో  చూడాలి. టీడీపీ పునాదులు కూడా చాలా బలమైనవి. పైగా అ పార్టీని తమ సొంతం చేసుకున్న వర్గాలు ఉమ్మడి ఏపీ నిండా చాలానే ఉన్నాయి. దాంతో గెలుపు ఓటములతో సంబంధం లేకుండా టీడీపీ ప్రస్థానం అలా సగిపోతోంది.

ఇవన్నీ ఇలా ఉంటే టీడీపీలో వచ్చే ఎన్నికల మీద గెలుపు ఆశలు పెరుగుతున్నాయట. ఏడాదిన్నర పాలనను వైసీపీ పూర్తి చేసుకుంది. జగన్ తొంబై శాతం పైగా హామీలను నెరవేర్చారు. ఇక వైసీపీలో కొత్త సినిమా చూపించేందుకు కూడా ఏమీ లేదని టీడీపీ పెద్దలు భావిస్తున్నారుట. అదే సమయంలో జగన్ తీసుకుంటున్న కొన్ని అసాధారణ నిర్ణయాల వల్ల కూడా ఆయన చిక్కుల్లో పడతారు అని టీడీపీ ఊహిస్తోంది.

ఏపీ ప్రజలు శాంతికాముకులని, వారు దూకుడు చర్యలను ఎపుడూ సహించబోరని కూడా ఆ పార్టీలో విశ్లేషించుకుంటున్నారుట. ఇక మరో విషయం ఏంటి అంటే చంద్రబాబు నుంచి తమ్ముళ్ళ వరకూ అంతా ఒక విషయం కచ్చితంగా నమ్ముతున్నారుట. జగన్ ఒక్క చాన్స్ అని అడిగారు కాబట్టే ఏపీ జనం సెంటిమెంట్ గా జగన్ని గెలిపించారు అన్న‌దే పసుపు శిబిరం భావన. ఆ సెంటిమెంట్ ని  తన అమిత బలంగా ఊహించుకుని జగన్ దూకుడు నిర్ణయాలు తీసుకుంటున్నారని, దీని ఫలితాలు, పర్యవసానాలు 2024లో జరిగే ఎన్నికల్లో  వైసీపీ చవిచూస్తుందని కూడా అంటున్నారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో మాత్రం తమ గెలుపు ఖాయమని టీడీపీ గట్టిగానే నమ్మకాలు పెట్టుకుందిట. రానున్న రోజుల్లో ఏ ఎన్నిక జరిగినా కూడా తెలుగుదేశం విజయాన్ని ఎవరూ ఆపలేరని  ఆ పార్టీ పెద్దలు ధీమాగా ఉన్నారని ఇన్ సైడ్ టాక్..



మరింత సమాచారం తెలుసుకోండి: