అమరావతి: కొందరు న్యాయమూర్తుల వ్యవహార శైలిపై ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్‌ లేఖ రాయడం ఏమాత్రం తప్పు కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, అలహాబాద్‌ హైకోర్టుల విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ దంతులూరి శ్రీనివాస రంగనాథవర్మ స్పష్టం చేశారు. ఇంట్లో వాళ్లు తప్పు చేసినప్పుడు ఇంటి పెద్దకే ఫిర్యాదు చేస్తారు. ఇది తప్పు ఎలా అవుతుంది? అని ప్రశ్నించారు. తమపై ఫిర్యాదులు చేయడానికి వీల్లేదనేందుకు న్యాయమూర్తులేమీ చట్టాలకు అతీతులు కారన్నారు. రాష్ట్ర హైకోర్టుపై ఓ వ్యక్తికి ఉన్న పట్టు గురించి విదేశీ పరిశోధకులే తమ పరిశోధన పత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారని, ఆ తరువాత ఈ విషయాన్ని రిటైర్డ్‌ న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆధారాలతో సహా బయట పెట్టారని చెప్పారు. ప్రశ్నిస్తే కోర్టు ధిక్కారమంటే అది గొంతు నొక్కేయడమేనన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై ఆయన  ఓ మీడియా చానల్‌తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘ఓ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయకూడదని గానీ, లేఖ రాయకూడదని గానీ ఎక్కడా లేదు. రాయవచ్చు. దాన్ని బహిర్గతం చేయడం వల్ల తీవ్రత పెరిగింది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. గతంలో చాలా మంది రాశారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఆ ఫిర్యాదుపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. ప్రభుత్వాలు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2004–05లో ఇంగ్లాడ్‌లోని బర్మింగ్‌హాం యూనివర్సిటీకి చెందిన ఓ వ్యక్తి భారతీయ న్యాయవ్యవస్థపై పరిశోధన చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర న్యాయవ్యవస్థపై గట్టి పట్టుకలిగి ఉన్నారని పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. పరిశోధన పత్రంలో ఆ ముఖ్యమంత్రి పేరును కూడా ఉదహరించారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు. విదేశీ స్కాలర్స్‌ కూడా భారత న్యాయవ్యస్థ గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ న్యాయవ్యవస్థ గురించి అలా మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి అప్పుడు ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. నేను అప్పుడు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నా’ అని ఆయన అన్నారు. న్యాయమూర్తులేమీ చట్టానికి అతీతులు కారని.. వారికీ పరిధులున్నాయన్నారు.

అతీతులమన్న రీతిలో న్యాయవ్యవస్థ వ్యవహరించరాదన్నారు. కోర్టు ధిక్కార చట్టాన్ని ఇష్టమొచ్చినట్లు వాడరాదని. అలా చేస్తే ప్రశ్నించే వ్యక్తులు, ప్రభుత్వాల గొంతు నొక్కేయడమే అవుతుందని రంగనాథవర్మ అన్నారు. కోర్టు ధిక్కారం కింద క్షమాపణ చెప్పలేదని ప్రశాంత్‌ భూషణ్‌కు రూపాయి జరిమానా విధించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కోర్టు ధిక్కార చట్ట ప్రయోగం సమస్యకు పరిష్కారం కాదని.. అసలు సమస్య ఏమిటి? ప్రభుత్వం ఎందుకు ఫిర్యాదు చేసింది? ఆరోపణలు నిజమైనవేనా? అన్న అంశంపై లోతుగా విచారణ జరపాలని తెలిపారు. ఆరోపణలకు ఆస్కారం రాకుండా చూసుకోవాలన్నారు. ఈ దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని.. అంతే తప్ప ధిక్కార చర్యలు పరిష్కారం చూపవని పేర్కొన్నారు. జస్టిస్‌ చలమేశ్వర్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు బయట పెట్టిన ఓ సంచలనాత్మక అంశం పత్రికల పతాక శీర్షికల్లో వచ్చిన దానిపై ఆయన మాట్లాడారు.

‘ఓ న్యాయమూర్తికి, నాటి ప్రభుత్వాధినేతకు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఆయన బయటపెట్టారు. న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి ఒకరు లేఖ రాశారు. ఇదే అంశానికి సంబంధించి నాటి ప్రభుత్వాధినేత నుంచి కూడా సుప్రీంకోర్టుకు లేఖ వచ్చింది. రెండూ లేఖల్లోని సారాంశం ఒకటే. అందులోని వాక్యాలు, పదాలు దాదాపు ఒకటే. అంటే ఆ లేఖ ప్రభుత్వాధినేత నుంచి ఆ సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వచ్చిందా? లేక సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి నుంచి ఆ ప్రభుత్వాధినేతకు వచ్చిందా? ఎవరి నుంచి ఎవరికి వెళ్లింది.? ఈ వ్యవహారాన్ని ఎలా భావించాలి. దీన్నే కదా జస్టిస్‌ చలమేశ్వర్‌ ప్రశ్నించారు. న్యాయమూర్తి ఎప్పుడూ తన అభిప్రాయాన్ని స్వతంత్రంగా రాయాలి. కానీ అటు ప్రభుత్వాధినేత, ఇటు సీనియర్‌ న్యాయమూర్తి లేఖలు మక్కీకి మక్కీగా ఉన్నాయి. దీన్ని ఎలా భావించాలి? అలా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నాటి ప్రభుత్వాధినేత సన్నిహిత సంబంధాలు చాలా ప్రశ్నలు, సందేహాలను రేకెత్తించాయి. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పనిచేయాలన్నదే ప్రజల ఆకాంక్ష’ అని రంగనాథ వర్మ చెప్పారు

మరింత సమాచారం తెలుసుకోండి: