సాధారణంగా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులు అధికార పార్టీలో చేరతారు. అలాగే ప్రస్తుతం ఏపీలో అధికారంలో వైసీపీలోకి టీడీపీ నుంచి వలసలు బాగానే జరిగాయి. 2019 ఎన్నికలైపోయిన దగ్గర నుంచి పలువురు టీడీపీ నేతలు చంద్రబాబుకు షాక్ ఇచ్చి, జగన్‌కు జై కొట్టారు. అలాగే నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీని వీడారు. ఇంకా ఎమ్మెల్సీలు కొందరు వైసీపీ తీర్ధం పుచ్చుకున్నారు. అయితే ఇంకా మరికొందరు నేతలు టీడీపీని వీడటం ఖాయమని ప్రచారం జరిగింది.

ఇక వారి జంపింగ్ చెక్ పెట్టేందుకు చంద్రబాబు  పదవుల పంపకం కార్యక్రమం చేపట్టారు. ఇప్పటికే పార్లమెంట్ స్థానాల వారీగా పురుష, మహిళా అధ్యక్షులని నియమించిన బాబు, తాజాగా ఏపీ, తెలంగాణ అధ్యక్షులతో పాటు పొలిట్‌బ్యూరో, జాతీయ ప్రధాన కార్యదర్శులు ఇతర పదవులని భర్తీ చేశారు. ఇక ఈ పదవులు భర్తీలో జంప్ అయిపోతారని వార్తలు వచ్చిన నేతలు పేర్లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా జాతీయ ఉపాధ్యక్షులుగా నియమించబడిన వారిలో ఎక్కువ మంది పార్టీకు దూరమవుతారని ప్రచారం జరిగిన వారే.

కావలి ప్రతిభా భారతి, గల్లా అరుణ, డి‌ఏ సత్యప్రభ, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి..ఈ నలుగురు పార్టీని వీడతారని పలురకాలుగా ప్రచారం జరిగింది. ఇక ఆ వార్తలకు చెక్ పెట్టడానికి బాబు వీరికి జాతీయ ఉపాధ్యక్షులుగా పదవులు ఇచ్చారు. అటు చాలా రోజుల నుంచి యాక్టివ్‌గా లేని కంభంపాటి రామ్మోహన్‌కు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చారు. ఇదే సమయంలో మాజీ ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావుని పొలిట్ బ్యూరోలోకి తీసుకోగా, నెల్లూరు టీడీపీ అధ్యక్షుడుగా పనిచేసిన బీదా రవిచంద్రకు జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి కవర్ చేయగా, కృష్ణా జిల్లా టీడీపీ అధ్యక్షుడుగా పనిచేసిన బచ్చుల అర్జునుడుని క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌గా పెట్టి న్యాయం చేశారు. మొత్తానికైతే చంద్రబాబు పార్టీ జంప్ అయిపోతారనుకునే నేతలకు మాత్రం పార్టీలో మంచి పదవులు ఇచ్చారనే చెప్పొచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: