టీడీపీ స్థాపించింది నందమూరి తారకరామారావు అనే సంగతి తెలుగు రాష్ట్రాల్లో చిన్నపిల్లాడికి సైతం తెలుసు. ఇక ఎన్టీఆర్ తర్వాత పార్టీని నడిపించాల్సింది ఆయన వారసులు. నందమూరి కుటుంబానికి చెందిన వ్యక్తులు పార్టీ పగ్గాలు తీసుకోవాలి. కానీ అనుహ్యా పరిణామాల మధ్య తెలుగుదేశం పగ్గాలు చంద్రబాబు తీసుకుని నడిపిస్తున్నారు. నారా ఫ్యామిలీ చేతిలోకి టీడీపీ వెళ్ళాక, నందమూరి కుటుంబానికి ప్రాముఖ్యత తగ్గిందనే చెప్పాల్సిన పనిలేదు.

అప్పట్లో హరికృష్ణకు మాత్రం ఏదో పదవులు ఇచ్చి, చంద్రబాబు నందమూరి ఫ్యామిలీని కవర్ చేసేవారు. హరికృష్ణకు రాజ్యసభ, పొలిట్‌బ్యూరో ఇచ్చినా కూడా ఆయనకు పార్టీలో పెద్దగా ప్రాధాన్యత ఉండేది కాదు. ఇక జూనియర్ ఎన్టీఆర్‌ని ఏ రకంగా పార్టీకి వాడుకుని వదిలేశారో అందరికీ తెలిసిందే. హరికృష్ణ ఉండగానే, బాలకృష్ణకు హిందూపురం ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చారు. ఇలా ఎన్టీఆర్ వారసులు టీడీపీలో ఉన్నా కూడా, నందమూరి ఫ్యామిలీ హవా ఉండేది కాదు. అయితే ఊహించని విధంగా హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. అప్పుడు సానుభూతి కోసమని చెప్పి, హరికృష్ణ ఫ్యామిలీ నుంచి సుహాసినిని పార్టీలోకి తీసుకొచ్చి, తెలంగాణ ఎన్నికల్లో నిలబెట్టారు.

అయితే ఎన్నికల్లో ఆమె దారుణంగా ఓడిపోయారు. ఓడిపోయినా పార్టీలోనే ఉంటున్నారు. ఇటు బాలకృష్ణ హిందూపురం ఎమ్మెల్యేగా ఉంటున్నారు. ఇలా సుహాసిని, బాలకృష్ణలు నందమూరి ఫ్యామిలీ తరుపున పార్టీలో ఉంటున్నారు. అయినా సరే వారికి సరైన ప్రాధాన్యత ఉండేది కాదు. కానీ ఇప్పుడు పార్టీ కష్టకాలంలో ఉంది. దీంతో బాబుకు నందమూరి ఫ్యామిలీ అవసరం బాగా ఉంది.

అందుకే వారిద్దరికి ఇప్పుడు పార్టీలో కీలక పదవులు ఇచ్చారు. సుహాసినికి తెలంగాణ ఉపాధ్యక్షురాలు పదవి ఇస్తే, బాలకృష్ణని పార్టీలో అత్యంత కీలకమైన పొలిట్‌బ్యూరోలో తీసుకున్నారు. ఇలా నందమూరి ఫ్యామిలీకి చెందిన బాలకృష్ణ, సుహాసినిలకు బాబు కీలక పదవులు కట్టబెట్టారు. మరి ఇకనుంచైనా టీడీపీలో నందమూరి ఫ్యామిలీకి సరైన గుర్తింపు ఇస్తారో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: