ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున బీసీ కార్పొరేషన్లు ఏర్పాటు చేయటంతో వైసీపీ శ్రేణులు ఆనందంలో మునిగి తేలుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నాయి. బీసీ వర్గాలకు జగన్‌ ప్రభుత్వం తీసుకువచ్చిన సాహసోపేత నిర్ణయంగా పరిగణిస్తోంది వైసీపీ. ఈ అంశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లాలని భావిస్తోంది.

రాష్ట్రంలోని 139 కులాలకు 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. దీంతో రాష్ట్రంలోని అన్ని వెనుకబడిన కులాలను ఒక గొడుగు కిందకు తీసుకువచ్చినట్లయింది. ఈ కార్పొరేషన్లకు పాలకమండళ్ల నియామకం కూడా పూర్తయ్యింది. చైర్మన్లు, డైరెక్టర్లుగా 728 మంది నియామకానికి సంబంధించిన జాబితాను ప్రభుత్వం ప్రకటించింది.ఈ నిర్ణయం వల్ల  బీసీ వర్గాలకు ప్రయోజనం జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. ఆయా వర్గాలకు అందాల్సిన ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలు అన్నీఇక ఈ కార్పొరేషన్ల ద్వారా జరుగనున్నాయి.

పాలకమండళ్ల ద్వారా తమ తమ కులాలకు ప్రయోజనాలు చేకూరేలా చర్యలు తీసుకోవటానికి అవకాశం ఏర్పడుతుంది. మరోవైపు బీసీల్లోని అన్ని కులాలకు రాజకీయ క్షేత్రంలో చోటు కల్పించినట్లు భావిస్తోంది వైసీపీ. వారిలో నాయకత్వ లక్షణాలు మరింత పెరగటానికి, చైతన్యం రావటానికి అవకాశం ఏర్పడుతుందని మంత్రులు చెబుతున్నారు. తమ ప్రభుత్వం తీసుకున్న ఈ కీలక విధానాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లేందుకు పార్టీ శ్రేణులు రంగంలోకి దిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో సంబరాలు నిర్వహిస్తున్నాయి.

ఇటు విజయవాడలో కూడా మంత్రులు సందడి చేశారు. తుమ్మలపల్లి కళా క్షేత్రం దగ్గర ఉన్న వైఎస్ఆర్‌ విగ్రహానికి మంత్రులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో అరడజను మంది మంత్రులు పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌, మంత్రులు బొత్స, పేర్ని నాని, కొడాలి నాని, పెద్దిరెడ్డి, అనీల్‌ కుమార్‌, పలువురు ఎమ్మెల్యేలు వైఎస్‌ విగ్రహానికి పూల మాలలు వేసి తమ కృతజ్ఞతలు వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం బీసీలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు ధర్మాన.

కేబినెట్‌ కూర్పులోనూ బీసీలకు జగన్‌ పెద్ద పీట వేశారని అన్నారు మంత్రులు. దీంతో ఈ వర్గాలు తమ వైపు తిరుగుతాయని అంచనా వేసుకుంటున్నాయి వైసీపీ వర్గాలు.  



మరింత సమాచారం తెలుసుకోండి: