అదేంటి సీఎం జగన్ అచ్చెన్నాయుడికి పదవి ఇప్పించడం ఏంటి అనుకుంటున్నారా.. అవును మరి ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదే ప్రచారం జరుగుతోంది. అచ్చెన్నాయుడిపై ఇటీవల ఈఎస్‌ఐ అవినీతి కేసు పెట్టడం.. ఆయన జైలుకు వెళ్లడం.. పైల్స్ వ్యాధితో బాధపడుతున్నా ఆయన్ను జైల్లో పెట్టాలని ప్రయత్నించారన్న ఆరోపణలు రావడం.. ఇలాంటి కారణాలతో అచ్చెన్నాయుుడు ఒక్కసారిగా పార్టీలో ఫోకస్ అయ్యారు.

అచ్చెన్నాయుడిని జగన్ సర్కారు టార్గెట్ చేస్తుందని టీడీపీ నేతలు బాగా ప్రచారం చేశారు. అలా మొత్తానికి టీడీపీలో అచ్చెన్నాయుడు హీరో అయ్యారు. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన్ను టీడీపీ అధ్యక్ష పదవికి ఎంపిక చేశారు. అయితే అచ్చెన్నపై అవినీతి కేసులు ఉన్నా.. అచ్చెన్నాయుడుకు ఎపి తెలుగుదేశం అద్యక్ష పదవి ఇవ్వడానికి కారణాలు ఏమిటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా ఉంది.

విచిత్రం ఏంటంటే.. ఈ పదవికి తొలుత  శ్రీకాకుళం ఎమ్.పి , అచ్చెన్నాయుడు అన్న కుమారుడు రామ్మోహన్ నాయుడు పేరు కూడా బాగా ప్రచారంలోకి వచ్చింది. కాని ఆ తర్వాత అచ్చెన్న ఈ ఎస్ ఐ స్కామ్ లో అరెస్టు కావడం, జైలుకు వెళ్లడం వంటి పరిణామాలు జరిగాయి. ఆ సమయంలో అచ్చెన్నాయుడుకు మద్దతుగా టిడిపి నాయకత్వం నిలిచింది. దాంతో ఆయన ప్రాముఖ్యత పెరిగిందని అంటున్నారు.

రామ్మోహన్ నాయుడు ఇంకా కుర్రాడే కావడం.. సీనియర్లతో డీల్ చేయడం కాస్త ఇబ్బందిగా ఉంటుందన్న కారణంతో అచ్చెన్నకు ఆ పదవి ఇవ్వాలని భావించినట్లు తెలుస్తోంది. ఇంతవరకు టీడీపీ అధ్యక్ష పదవిలో ఉన్న కళా వెంకట్రావుది కూడా శ్రీకాకుళం జిల్లానే. ఏదేమైనా స్కామ్ లో చిక్కుకుని అరెస్టు అవడమే అచ్చెన్నాయుడుకు ప్లస్ పాయింట్ అయిందని టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే తరచూ జగన్ పై ఉన్న అవినీతి కేసుల గురించి పదే పదే ప్రస్తావించే తెలుగు దేశం నేతలకు ఇప్పుడు అచ్చెన్నాయుడిపై ఉన్న కేసులు ఇబ్బంది కరంగా మారవా అన్న ప్రశ్న తలెత్తుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: