రోజు రోజుకీ ఉల్లిపాయల రేట్లు భారీగా పెరిగిపోతుండటంతో.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నివారణ  చర్యలు చేపట్టింది. రిటైల్ మార్కెట్లో ప్రస్తుతం 70 రూపాయలు ఉన్న ఉల్లి రేటు.. త్వరలో 100రూపాయలకు చేరుకునే అవకాశం ఉందని అధికారుల అంచనా. అందుకే ముందుగానే అప్రమత్తం అయి, ఉల్లిని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన ఉల్లిని సబ్సిడీపై వినియోగదారులకు తక్కువ ధరకు అందివ్వాలని అనుకుంటున్నారు.
గతేడాది కూడా ఏపీలో సబ్సిడీ ఉల్లిపాయలను రైతు బజార్లలో అందించారు. ఆధార్ కార్డ్ కి 2 కేజీల చొప్పున ఉల్లిపాయల్ని సబ్సిడీపై అందించారు. ఈ ఏడాది కూడా  భారీ వర్షాలు, వరదల వల్ల ధర భారీగా పెరిగే అవకాశాలుండటంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. త్వరలోనే రైతు బజార్లలో ఉల్లిపాయల్ని సబ్సిడీపై అందివ్వాలనుకుంటోంది ఏపీ ప్రభుత్వం. మరోవైపు రోజు రోజుకీ ఉల్లి ధరలు పెరుగుతుండటంతో.. ప్రభుత్వంపై కూడా ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో త్వరలో దీనిపై నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు అధికారులు. 

గతేడాది లాగానే ఏపీలో 40 వేల హెక్టార్లలో ఉల్లి పంటను రైతులు సాగు చేసినప్పటికీ, భారీ వర్షాల వల్ల దిగుబడి బాగా తగ్గిపోయింది. ఇదే పరిస్థితి మహారాష్ట్ర, కర్నాటకలోనూ ఉండటంతో ఉల్లి కొరత ఏర్పడింది. రాష్ట్రంలోని దిగుబడి సరిపోక.. వ్యాపారులు పలు రాష్ట్రాల నుంచి నుంచి దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయాలు చేస్తున్నారు. ఈ ఏడాది ఉల్లి నిల్వలు లేకపోవడంతో రానున్న రోజుల్లో కిలో రూ.100 వరకు చేరుకునే అవకాశముందని మార్కెటింగ్‌ శాఖ అధికారులు భావిస్తున్నారు. దీంతో ప్రస్తుతం మార్కెట్‌లోని ధరలు, వస్తున్న ఉల్లి నిల్వలు తదితర అంశాలను వారు పరిశీలిస్తున్నారు. నాఫెడ్‌ నుంచి ఉల్లిని కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. గతేడాదిలాగే ఈ ఏడాది కూడా ధరల స్ధిరీకరణ నిధి నుంచి ఉల్లిని కొనుగోలు చేస్తామని మార్కెటింగ్‌ శాఖ ప్రత్యేక కమిషనర్‌ ఎస్‌.ప్రద్యుమ్న తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించిన తర్వాత ధరపై నిర్ణయం తీసుకుంటామన్నారు అధికారులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: